● నేటి నుంచి 18వ తేదీ వరకు అమలు
కాజీపేట రూరల్/డోర్నకల్ : డోర్నకల్–పాపట్‌పల్లి మధ్య చేపట్టిన ఎన్‌ఐ (నాన్ ఇంటర్ లాకింగ్) పనుల కారణంగా ఈ నెల 14 నుంచి (మంగళవారం) 18వ తేదీ వరకు కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ రవీందర్ సోమవారం తెలిపారు. కొన్ని రైళ్లను రద్దు, దారి మళ్లింపు, పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. సికింద్రాబాద్–విజయవాడ (12713/12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–గుంటూరు (12705 /12706) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, కాజీపేట–డోర్నకల్, డోర్నకల్–కాజీపేట (67765/67766) పుష్‌పుల్ రైళ్లను అప్ అండ్ డౌన్ రూట్‌లో రద్దు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సికింద్రాబాద్–గుంటూరు (17201/17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్ కాజీపేట–సికింద్రాబాద్ వరకే ప్రయాణించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 16, 17వ తేదీల్లో భువనేశ్వర్–ముంబాయి–భువనేశ్వర్ (11020/11019) కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను వయా గుంటూరు మీదుగా, ఈ నెల 16,18వ తేదీన కాకినాడ–షిర్డీ, షిర్డీ–కాకినాడ (17205 /17206) షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లను వయా నల్లగొండ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా దారి మళ్లించి నడిపిస్తున్నట్లు స్టేషన్ మేనేజర్ తెలిపారు.
19న ఉమ్మడి జిల్లా స్థాయి ఖోఖో ఎంపిక పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 19వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి మహిళలు, పురుషుల ఖోఖో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఖోఖో అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి తోట శ్యామ్‌ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు 19న ఉదయం జేఎన్‌ఎస్‌లోని ఖోఖో మైదానం వద్ద ఉదయం 9గంటలకు హాజరు కావాలన్నారు. ఇందులో ఎంపికై న క్రీడాకారులతో కూడిన జట్లు నవంబర్ 7 నుంచి 11వ తేదీ వరకు పెద్దపల్లిలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. ఇతర వివరాలకు 98492 10746 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలు వాయిదా
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో మూడు రోజులపాటు (13 నుంచి 15వ తేదీ వరకు) జరగాల్సిన అండర్–19 బాలబాలికల క్రీడా ఎంపిక పోటీలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–19 ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షం కారణంగా క్రీడా ఎంపికలను వాయిదా వేసినట్లు తెలిపారు. తిరిగి దీపావళి పండుగ అనంతరం నిర్వహిస్తామని, ఆయా తేదీలను సైతం ముందస్తుగా ప్రకటిస్తామని పేర్కొన్నారు.
ఈదుకుంటూ వెళ్లి విద్యుత్‌లైన్ మరమ్మతు
గార్ల: మండల కేంద్రంలోని పెద్దచెరువులో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి పిడుగుపడి మెయిన్ విద్యుత్‌లైన్ తీగలు తెగి నీటిలో పడ్డాయి. దీంతో సోమవారం సేరిపురం, బాలాజీతండా పంచాయతీలో విద్యుత్ సరఫరా నిలిచింది. కాగా, విద్యుత్ ఏఈ మహేంద్రబాబు ఆదేశాల మేరకు లైన్‌మెన్ సుధాకర్, కాంట్రాక్ట్ ఉద్యోగి యుగంధర్ చెరువులో ఈదుకుంటూ స్తంభం వరకు వెళ్లి మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో వారిని పలువురు అభినందించారు.