
ఉచ్చులో పడి దుప్పి మృత్యువాత
● విశ్వనాథపురంలో ఘటన
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని విశ్వనాథపురంలో సోమవారం ఉచ్చులో పడి ఓ మచ్చల దుప్పి మృత్యువాత పడింది. ఎఫ్‌ఆర్‌ఓ రావుల కొండల్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామ సమీపంలోని నమిలిగొండ గుట్టల అటవీప్రాంతం నుంచి వచ్చిన ఓ మచ్చల దుప్పి ఆదివారం సాయంత్రం పశువులతో కలిసి తిరుగుతూ గ్రామస్తులకు కనిపించింది. ఈ క్రమంలో అడవి పందుల నుంచి తమ పంటలను రక్షించేందుకు రైతులు ఏర్పాటు చేసిన ఉచ్చు లేదా వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో పడి ఉండొచ్చు. దీంతో వైరు మెడకు చుట్టుకుంది. అయితే ఉచ్చు నుంచి తప్పించుకుని విశ్వనాథపురం ఎస్సీ కాలనీ వరకు రాగా అక్కడ పెద్ద కట్టెకు వై రు చిక్కుకుంది. దీంతో మెడకు ఉన్న వైరు బిగుసుకోవడంతో ఊపిరా డక మృత్యువాత పడింది. దీనిపై గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి పశువైద్యులతో పోస్టుమార్టం చేయించి దుప్పి కళేబరాన్ని పూడ్చిపెట్టామని ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు. ఆయన వెంట ఎఫ్‌ఎస్‌ఓ జరీనా, ఎఫ్‌బీఓ రవి తదితరులున్నారు.