
బాలికలకు స్వీయరక్షణలో శిక్షణ
ఉమ్మడి జిల్లాలో పీఎంశ్రీ స్కూల్స్ ఇలా
విద్యారణ్యపురి: పీఎంశ్రీ పాఠశాలల్లో అనేక సదుపాయాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్‌లు ఏర్పాటవుతున్నాయి. తాజాగా స్వీయ రక్షణ కోసం బాలికలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఒక్కో పాఠశాలకు రూ.30వేలు మంజూరయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ఎంపిక చేసిన పీఎంశ్రీ స్కూళ్లకు ఈ నిధులు మంజూరయ్యాయి.
పీఎంశ్రీ పాఠశాలల్లో చదువుతున్న బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఈ శిక్షణ ఉండనుంది. శిక్షణ ద్వారా బాలికలు అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకునేందుకు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కుంగ్‌ఫూ, కరాటే, జూడో, కలరియపట్టు తదితర ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇవ్వనున్నారు. నడ్జెస్, కిక్స్‌పంచ్‌ల వంటి ప్రాథమిక శిక్షణ పద్ధతులను నేర్పిస్తారు. ప్రతీ సెషన్‌లో వార్మప్, నైపుణ్య శిక్షణ, ప్రదర్శన, కూల్‌డౌన్ భాగాలు ఉంటాయి.
ప్రతీ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) ఆధ్వర్యంలో (పర్యవేక్షణ)ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. జిల్లా స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ సహాయంతో ట్రైనర్లను ఎంపిక చేస్తారు. మహిళా ట్రైనర్లకు ప్రాధాన్యం ఇస్తారు. లేనిపక్షంలో పురుష ట్రైనర్లను నియమించుకోవాల్సింటుంది. బాలికలకు ఈ శిక్షణ పాఠశాల సమయంలోనే ఉంటుంది. ప్రతీ పాఠశాలలో పీఈటీ, పీడీ, ఇతర ఉపాధ్యాయుని పర్యవేక్షణలో శిక్షణ కొనసాగించాల్సి ఉంటుంది.
ప్రతీ పీఎంశ్రీ పాఠశాలకు రూ.30వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. ట్రైనర్‌కు ప్రతీనెల రూ.10వేల గౌరవ వేతనం చెల్లించాల్సింటుంది. మొత్తంగా 72 సెషన్‌లు నిర్వహించాలి. మూడు నెలలపాటు వారానికి 6 రోజుల శిక్షణ లేదా ఆరు నెలలపాటు వారానికి మూడు రోజుల శిక్షణ ఇవ్వాల్సింటుంది.
బాలికలకు ఈ స్వీయ రక్షణ శిక్షణ 25 సెషన్‌ల అనంతరం ప్రాక్టికల్‌గా మూల్యాంకనం నిర్వహిస్తారు. గ్రూప్ ఏ (6, 7తరగతులు), గ్రూప్ బీ (8, 9తరగతులు)గా విభజించి ఫిజికల్ డైరెక్టర్ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభావంతులైన విద్యార్థులకు డిజిటల్ సర్టిఫికెట్లు (1వ, 2వ, 3వ స్థానం) అందజేస్తారు. 72 సెషన్‌ల షెడ్యూల్ మూల్యాంకన విధానం, పాఠశాలల జాబితా అనుబంధంగా జారీ చేస్తారు. ఇదిలా ఉంటే పీంఎశ్రీ ప్రాథమిక పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం లేదు.
పీఎంశ్రీ పాఠశాలల్లో అమలుకు
నిధులు మంజూరు
ఒక్కో పాఠశాలకు రూ.30వేలు
కరాటే, కుంగ్‌ఫూ, జూడోలో ట్రైనింగ్
త్వరలో శిక్షకుల నియామకం..
మహిళలకు ప్రాధాన్యం
జిల్లా స్కూళ్లు
హనుమకొండ 13
వరంగల్ 14
మహబూబాబాద్ 21
జనగామ 15
జేఎస్ భూపాలపల్లి 07
ములుగు 08