‘ప్రజాపాలన’ ముఖ్య అతిథిగా రాంచంద్రునాయక్‌ | - | Sakshi
Sakshi News home page

‘ప్రజాపాలన’ ముఖ్య అతిథిగా రాంచంద్రునాయక్‌

Sep 16 2025 10:18 AM | Updated on Sep 16 2025 10:18 AM

‘ప్రజ

‘ప్రజాపాలన’ ముఖ్య అతిథిగా రాంచంద్రునాయక్‌

సాక్షి, మహబూబాబాద్‌: ప్రభుత్వం ఈ నెల 17న అధికారికంగా నిర్వహించే ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే జాటోత్‌ రాంచంద్రునాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే వేడుకలకు రాంచంద్రునాయక్‌ హాజరై జాతీయ పతాకావిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి విప్‌ మాట్లాడనున్నారు.

వచ్చే నెల 4న ఐఆర్‌సీఎస్‌ సర్వసభ్య సమావేశం

కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌

మహబూబాబాద్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా సర్వ సభ్య సమావేశం వచ్చే నెల 4న నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని లయన్స్‌ క్లబ్‌ భవనంలో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఐఆర్‌సీఎస్‌ కార్యవర్గం, ఎజెండాలోని పలు అంశాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. సభ్యులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.

విద్యుత్‌ కాంట్రాక్టర్లకు

బిల్లులు చెల్లించాలి

నెహ్రూసెంటర్‌: విద్యుత్‌ కాంట్రాక్టర్లకు పనులు ముగిసిన వెంటనే బిల్లులు చెల్లించాలని విద్యుత్‌ కాంట్రాక్టర్ల యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు బందు సైదులు అన్నారు. విద్యుత్‌ కాంట్రాక్టర్లు సోమవారం విద్యుత్‌శాఖ జిల్లా ఎస్‌ఈ విజయేందర్‌రెడ్డికి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో ఆలస్యం జరుగుతుందని, రేట్ల పెంచాలని డిమాండ్‌ చేస్తూ సమ్మె చేస్తున్నామని తెలిపారు. ఏడు సంవత్సరాలుగా రేట్ల పెంపు జరగలేదని ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి సమ్మెలో ఉంటామని పనులను చేపట్టబోమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్లు కుమార్‌, విశ్వేశ్వర్‌రావు, సోమిరెడ్డి, నరేష్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటు తప్పదు

కేసముద్రం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే, ప్రజల్లో తిరుగుబాటు తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన ఆ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రష్యా నుంచి చమురు దిగుమతి నిలిపివేయాలనే పేరుతో, భారతదేశం ఎగుమతులపై 50శాతం టారిఫ్‌లు పెంచాడన్నారు. యురోపియన్‌ దేశాలపై భారత ఎగుమతులపై సుంకాలు వందశాతం పెంచాలని ఒత్తిడి తెస్తున్నాడన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల రాజు, మార్తనేని పాపారావు, మండల కార్యదర్శి గొడిశాల వెంకన్న, నీరుటి జలేందర్‌, తాడబోయిన శ్రీశైలం, జల్లె జయరాజ్‌, నర్సయ్య, సావిత్ర, జాటోత్‌ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ఓపెన్‌ డిగ్రీ అడ్మిషన్ల గడువు పెంపు

మహబూబాబాద్‌ అర్బన్‌: డాక్టర్‌ బీఆర్‌ అబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2025–26 విద్యా సంవత్సరానికి డిగ్రీ అడ్మిషన్ల గడువు ఈ నెల 26వరకు పెంచినట్లు ప్రభుత్వ డీగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మణ్‌ నాయక్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో సోమవారం ఓపెన్‌ డిగ్రీ అడ్మిషన్ల వాల్‌ పోస్టర్‌ను అధ్యాపక బృందం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ.. ఇంటర్‌, ఐటీఐ, పాలిసెట్‌, ఓపెన్‌ ఇంటర్‌ పాసైన విద్యార్థులు ప్రవేశాలకు అర్హులన్నారు. డిగ్రీలో బీఎస్సీ సైన్స్‌, మ్యాథ్స్‌, బీకాం, బీఏ గ్రూపులు ఉన్నాయని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 500తో అడ్మిషన్‌ పొందవచ్చన్నారు. పూర్తి వివరాలకు 7382929705 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

‘ప్రజాపాలన’ ముఖ్య అతిథిగా రాంచంద్రునాయక్‌
1
1/1

‘ప్రజాపాలన’ ముఖ్య అతిథిగా రాంచంద్రునాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement