
విద్యార్థిని చితకబాదిన కిరాణాషాపు యజమాని
కురవి : చాక్‌లెట్లు కొనేందుకు కిరాణా షాపునకు వెళ్లిన విద్యార్థిని దుకాణ యజమాని, ఆమె కుమార్తె చితకబాదారు. ఈ ఘటన సోమవారం మండలంలోని కంచర్లగూడెం తండాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కురవి మండలం కంచర్లగూడెం ప్రాథమిక పాఠశాలలో గుగులోత్ ఆకాశ్ ఐదో తరగతి చదువుతున్నాడు. కొంత మంది చిన్నారులు ఏడుస్తుండడంతో హెచ్‌ఎం వెంకటేష్ రూ.5 ఇచ్చి ఆకాశ్‌ను చాక్‌లెట్లు తీసుకురమ్మని చెప్పాడు. దీంతో తండాలోని కిరాణా షాపునకు వెళ్లాడు. అక్కడికి వెళ్లగానే కోతుల గుంపు బాలుడిపై దాడికి యత్నించాయి. దీంతో ఆకాశ్ భయంతో షాపులోకి వెళ్లాడు. ఆ సమయంలో షాపులో యజమాని లేడు. అనంతరం యజమాని గుగులోత్ కాళీ షాపులోకి వచ్చింది. షాపులోకి రాగానే భయపడుతున్న విద్యార్థి ఆకాశ్‌ను చూసి ఎందుకు లోపలికి వచ్చావని అడగడంతో కోతులు మీదకు రావడంతో వచ్చానని చెప్పాడు. విద్యార్థి మాటలు వినకుండా గల్లాపెట్టెలోని కొంత నగదును బాలుడి జేబులో పెట్టి దొంగతనం చేసేందుకు వచ్చావని విచక్షణారహితంగా కర్రతో కొట్టింది. యజమాని కుమార్తె బానోత్ ప్రమీల సైతం బాలుడిని దారుణంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. రెండు గంటలపాటు బాలుడిని షాపులో బంధించి కొట్టారు. ఆకాశ్ తమ షాపులో దొంగతనం చేసేందుకు వచ్చాడని బాలుడి తండ్రి శివలాల్‌కు యజమాని ఫోన్ చేసి చెప్పింది. తాను వచ్చి మాట్లాడుతా అని ఫోన్ పెట్టేశాడు. తర్వాత బాలుడిని విడిచిపెట్టారు. ఆకాశ్ ఇంటికి వెళ్లలేదు. దీంతో తాత మంగ్యా తన మనుమడు ఆకాశ్ ఇంటికి రాకపోయే సరికి షాపు వద్దకు వెళ్లాడు. తన మనుమడు ఎక్కడ అని అడగడంతో షాపు యజమాని కాళీ ఇటుకతో తలపై కొట్టడంతో వృద్ధుడి తల పగిలింది. బాలుడి తండ్రి శివలాల్ తండాకు చేరుకుని కురవి పోలీస్ స్టేషన్‌లో జరిగిన విషయం చెప్పాడు. శివలాల్ ఫిర్యాదు మేరకు బాలుడిని కొట్టిన గుగులోత్ కాళీ, ఆమె కుమార్తె బానోత్ ప్రమీలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు.
బాలుడికి తీవ్రగాయాలు
అడిగేందుకు వెళ్లిన తాతపైనా దాడి..

విద్యార్థిని చితకబాదిన కిరాణాషాపు యజమాని