
మాజీ డిప్యూటీ సీఎం ‘తాటికొండ’ గృహ నిర్బంధం
హన్మకొండ: మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో తాటికొండ రాజయ్య పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం రఘునాథపల్లి మండలంలో పాదయాత్ర కొనసాగించాల్సి ఉండగా అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా హనుమకొండ సర్క్యూట్ హౌజ్ రోడ్‌లోని స్వగృహంలో పోలీసులు గృహ నిర్బంధం లో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, బీఆర్‌ఎస్ శ్రేణులు రాజయ్య ఇంటికి చేరుకుని సంఘీభావం తెలిపారు. సుమారు నాలుగు గంటల పాటు ఈ ఉద్రిక్తత కొనసాగింది. అనంతరం రాజయ్యను గృహ నిర్బంధం నుంచి విముక్తి చేయడంతో 12 గంటలకు సద్దుమణిగింది. అనంతరం పాదయాత్రకు వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ నీతి వ్యాఖ్యలు మాట్లాడే స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి పార్టీ మారడం ఏ విలువలకు నిదర్శనమని ప్రశ్నించారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకే పార్టీ మారాడని దుయ్యబట్టారు. తాటికొండ రాజయ్య మాట్లాడుతూ బీఆర్‌ఎస్ జెండాతో గెలిచిన కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పాదయాత్ర చేస్తుంటే భయం ఎందుకని ప్రశ్నించారు. ఏ పార్టీలో ఉన్నావో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం ఆరు నూరైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా పాదయాత్ర కొనసాగిస్తానని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నారు.
హనుమకొండలో ఉద్రిక్తత
రైతుల కోసం పాదయాత్ర కొనసాగిస్తా
అవసరమైతే ఆమరణ నిరాహార
దీక్ష చేస్తా
మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య