
పోలీస్ తిప్పలు!
● యూరియా పంపిణీలో జాగారం
● ఉదయం నుంచి
సాయంత్రం వరకు డ్యూటీలు
● కొరతపై నిఘా వర్గాలతో నివేదిక
● పంపిణీలో మార్పులు, చేర్పులు
సాక్షి, మహబూబాబాద్: రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు అందించే వ్యవసాయశాఖ.. ఈ ఏడాది సీజన్‌కు ముందు నుంచే యూరియా పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈక్రమంలో ఆగస్టు మొదటి వారం నుంచి పోలీసులు లేనిదే యూరియా పంపిణీ చేయలేమని వ్యవసాయశాఖ అధికారులు తేల్చి చెప్పారు. దీనికి తోడు రోజురోజుకూ సమస్య జఠిలం కావడం.. ఎక్కడ లేని సమస్య జిల్లాలోనే ఉండడంతో యూ రియా పంపిణీ అధికారులకు సవాల్‌గా మారింది. ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వచ్చేలా వ్యవహారం ముదరడంతో.. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి చొరవ తీసుకునే వరకు వెళ్లింది. దీంతో యూరియా పంపిణీ శాంతి భద్రతల సమస్య వర కు దారి తీయడం.. అందులో రైతుల సమస్య కావడంతో పోలీస్‌శాఖకు అగ్ని పరీక్షగా మారింది.
రోజుకో చోట సమస్య..
యూరియా పంపిణీలో సమస్యను ఒకచోట చక్కదిద్దితే మరోచోట ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. ఇలా జిల్లాలో యూరియా కోసం వచ్చిన రైతులు కింద పడిపోవడం, తలకు గాయాలు కావడం.. మరో చోట ప్రమాదానికి గురై మృతి చెందడం, ఇంకోచోట యూరియా లారీపై రైతులు దాడి చేసి యూరియా బస్తాలు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం.. క్యూలో రైతులు గొడవలు పెట్టుకోవడం.. మహిళల సిగపట్లు.. మొదలైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని అదుపు చేయడం కోసం పోలీసు ల పహారా మధ్య టోకెన్లు, యూరియా బస్తాల పంపిణీ చేయాల్సి వస్తోంది.
పోలీసుల జాగారం..
ఒక వైపు యూరియా ఎప్పుడు వస్తుందో.. టోకెన్లు ఎప్పుడు ఇస్తారో అనే ఆలోచనతో రైతులు పీఏసీఎస్ సెంటర్లు, ఆగ్రోస్, రైతు వేదికల వద్ద రాత్రంతా పడుకొని జాగారం చేస్తున్నారు. వీరితోపాటు పోలీసులు కూడా అక్కడే డ్యూటీలు చేస్తున్నారు. టోకెన్లు, యూరియా పంపిణీ వద్ద బందోబస్తూ కోసం.. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌తో పాటు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు తేడా లేకుండా యూరియా పంపిణీ కేంద్రాల వద్ద డ్యూటీలు చేస్తున్నారు. యూరియా అనేది అతిపెద్ద సమస్యగా పరిగణించి.. రోజు ఉదయం పోలీసులు కాన్ఫరెన్స్‌లో చర్చించుకొని పరిస్థితిని అంచనా వేసి డ్యూటీలు వేస్తున్నారు. అయితే పదిహేను రోజుల నుంచి యూరియా పంపిణీ పనిలోనే పోలీసులు ఉండడంతో ఇతర కేసుల కోసం స్టేషన్‌లో నామ మాత్రం సిబ్బందికి డ్యూటీలు వేస్తున్నారు.
రంగంలోకి నిఘా వర్గాలు..
రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా చేస్తున్నామని వ్యవసాయ, సహకార శాఖ ల అధికారులు చెబుతున్నా.. సమస్య సద్దుమణగపోవడంతో అసలేం జరుగుతుందనే విషయంపై జిల్లా పోలీస్‌శాఖ నిఘా వర్గాలను రంగంలోకి దింపినట్లు సమాచారం.. సమస్య తీవ్రంగా ఉన్న మరిపెడ ఏడీఏ పరిధితోపాటు, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. ఆగస్టు 28 వరకు పీఏసీఎస్‌లు, ఆగ్రోస్, ఇతర కేంద్రాల్లో ఇష్టారాజ్యంగా బస్తాలు ఇచ్చారు. ఇందులో రైతులే కాకుండా దళారులకు కూడా బస్తాలు ఇచ్చారు. దీంతో నిజమైన రైతులకు యూరియా అందలేదని గుర్తించినట్లు తెలిసింది. దీనిని అదుపు చేసేందుకు రైతు బంధు జాబితాను ముందు పెట్టుకొని పట్టాదారుపాస్ పుస్తకాలు, ఆధార్ కార్డును పరిశీలించి రైతు వేదికల్లో టోకెన్లు ఇచ్చి.. రైతుల జాబితాను డిస్‌ప్లే చేసి యూరియా పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టారు. డబ్బులు తీసుకోవడం మినహా.. టోకెన్లు ఇవ్వడం, బస్తాల పంపిణీ, రైతుల సమన్వయం చేసే పని అంతా పోలీసులే చేయడం మొదలు పెట్టారు. దీంతో గతంతో పోలిస్తే సమస్య కాస్త సద్దుమణిగిందని అధికారులు చెబుతున్నారు.