
నిరీక్షణకు తెర!
సాక్షి, మహబూబాబాద్ : నమ్మకంతో భూములు కొనుగోలు చేసి తెల్లకాగితంపై ఒప్పందం కుదుర్చుకున్న రైతులు భూమిని సాగు చేసుకుంటున్నా.. వారి పూర్తి స్థాయి హక్కు రాలేదు. ఇటువంటి రైతులకు భూమి హక్కు కల్పించేందుకు ప్రభుత్వం కల్పించిన సాదా బైనామాకు ఇంత కాలం అడ్డంకిగా ఉన్న సమస్యలకు కోర్టు స్టే తొలగిపోయింది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంలో నిబంధనలకు పొందుపరుస్తూ జీఓ జారీ చేశారు. దీంతో ఐదు సంవత్సరాలుగా సాదాబైనామా కోసం ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడనుంది.
తొలగిన అడ్డంకులు
భూ ప్రక్షాలన సందర్భంగా వెలుగులోకి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు 2020లో అప్పటి ప్రభుత్వం 121 జీఓ తీసుకొచ్చింది. ఈ జీఓ ప్రకారం భూ క్రయవిక్రయాలపై తెల్లకాగితం ఉంటే చాలు సాదా బైనామా ద్వారా పట్టేదారు పాస్ పుస్తకాలు జారీ చేసే అవకాశం వచ్చింది. దీనిని ఆసరాగా చేసుకొని జిల్లా వ్యాప్తంగా 80 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే 2020 ఆర్‌ఓఆర్ చట్టంలో క్రమబద్ధీకరణ సెక్షన్లు లేనందున కోర్టు స్టే విధించింది. దీంతో సాదాబైనామా ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రభుత్వం ఇటీవల 106 జీఓ తీసుకొచ్చి అడ్డంకులను తొలగించడంతో సాదాబైనామాకు మార్గం సుగమనం అయ్యింది.
కాస్తులో ఉన్నా..
రూ.లక్షలు పెట్టి భూమిని కొనుగోలు చేసుకొని.. కాస్తులో ఉన్నా.. హక్కు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా బ్యాంకు రుణాలు, ప్రభుత్వం అందించే సబ్సిడీతో ఎరువులు, విత్తనాల కొనుగోలు, పండించిన ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో గిట్టుబాటు ధరకు అమ్మడం, చివరకు ప్రకృతి వైపరీత్యాలకు పంటనష్టం జరిగితే వచ్చే పరిహారం పొందేందుకు పట్టేదారు పాస్ పుస్తకం అనివార్యమైంది. దీంతో భూమి తనదైనా.. సాగుచేసి పంట పండిస్తున్నా.. హక్కు పత్రం లేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
12 సంవత్సరాలు కాస్తులో ఉన్నవారికే..
సాదాబైనామాకు అడ్డంకి తొలిగినా.. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 106 జీఓ ప్రకారం 2014కు పూర్వం క్రయవిక్రయాలు జరిగినట్లు ఉండి.. 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకున్నవారికే అవకాశం ఉంటుంది. అంటే 12 సంవత్సరాల క్రితం భూమిని కొని కాస్తులో ఉన్నవారికే సాదాబైనామా ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు అందనున్నాయి.
రెవెన్యూ సదస్సులో..
గత ప్రభుత్వ హయాంలో 2020లో రైతులు చేసుకున్న దరకాస్తులకు తోడుగా ప్రభుత్వం ఇటీవల భూ భారతి చట్టం అమలుకోసం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు కూడా పరిశీలిస్తున్నారు. అంతకు ముందు 80వేల సాదా బైనామా దరఖాస్తులు రాగా.. రెవెన్యూ సదస్సుల్లో 39,513 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా 24,014 దరఖాస్తులు సాదాబైనామావే ఉన్నాయి. అయితే గతంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అందులో ఉన్న దరఖాస్తుల్లో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన వాటిని పరిశీలించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
కోర్టు గ్రీన్ సిగ్నల్‌తో రైతుల్లో ఆశలు
2020లో 80వేలకు పైగా సాదాబైనామా దరఖాస్తులు
నిబంధనల ప్రకారం పట్టాలు
జిల్లాలో మొదలైన ప్రక్రియ
జిల్లాలో వచ్చిన దరఖాస్తుల వివరాలు
సమస్య వచ్చిన
దరఖాస్తులు
సర్వే నంబర్ మిస్సింగ్ 1,476
పెండింగ్ మ్యుటేషన్ 384
డీఎస్ పెండింగ్ 1,148
విస్తీర్ణ సవరణ 1,632
భూ స్వభావం 263
పట్టాదారు పేర్ల సవరణ 225
ప్రొహిబిటెడ్ లిస్టు నుంచి
తీసివేయడం 462
ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చడం 02
అసైన్డ్ భూ సమస్య 1,378
ఓఆర్‌సీ ఇష్యూ కానివి 45
38–ఈ సర్టిఫికెట్ రాకపోవడం 06
వారసత్వ సమస్య 2,007
భూ సేకరణ సమస్య 169
ఇతర సమస్యలు 30,316
మొత్తం 39,513
ప్రక్రియ వేగవంతమైంది..
భూ భారతి చట్టం అమలు ప్రక్రియ జిల్లాలో వేగంగా సాగుతోంది. సాదా బైనామాకు ఉన్న అడ్డంకులు తొలిగి పోయాయి. నిబంధనలను అనుసరించి ప్రక్రియ మొదలవుతుంది. అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి గైడెన్స్ రావాల్సి ఉంది. మిగిలిన సమస్యలు పరిష్కారం అవుతున్నాయి.
– అనిల్ కుమార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ

నిరీక్షణకు తెర!