
జీపీ భవనాల్లోనే మున్సిపల్ కార్యాలయాలు
● ఇబ్బందులు పడుతున్న అధికారులు, సిబ్బంది
మహబూబాబాబాద్: మేజర్ గ్రామపంచాయతీలను ప్రభుత్వం మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసింది. ప్రజాప్రతినిధులు అప్‌గ్రేడ్‌పై పెట్టిన శ్రద్ధ నూతన భవనాల నిర్మాణాలపై పెట్టడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపోను గదులు లేక అధికారులు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఐదు మున్సిపాలిటీలు జీపీ భవనాల్లోనే..
జిల్లాలో మానుకోట మున్సిపాలిటీ, మరిపెడ, డోర్నకల్, తొర్రూర్‌తో పాటు ఇటీవల కేసముద్రంను కూడా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం అన్ని కార్యాలయాలు గ్రామపంచాయతీ భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 68,889 మంది జనాభా, 57,828 మంది ఓటర్లు ఉన్నారు. 25,000లకు పైగా గృహాలు ఉన్నాయి, తొర్రూరులో 16 వార్డులు 19,100 జనాభా, మరిపెడలో 15 వార్డులు 17,875 మంది జనాభా, డోర్నకల్‌లో 15 వార్డులు 14,425 మంది జనాభా ఉన్నారు. కేసముద్రంలో 16 వార్డులుగా అధికారులు నిర్ణయించినప్పటికీ అధికారికంగా వార్డుల విభజన పూర్తి కాలేదు. జనాభా 19,438 మంది ఉన్నారు.
2018లోనే శంకుస్థాపన..
పురపాలక అభివృద్ధి నిధుల నుంచి 2018లోనే మానుకోట మున్సిపాలిటీ భవనానికి రూ.5 కోట్ల నిధులతో శంకుస్థాపన చేశారు. నేటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బిల్లులు రాకపోవడంతో నిర్మాణ పనులను కాంట్రాక్టర్ నిలిపివేశారు. మరిపెడ మున్సిపాలిటీకి టెండరు పూర్తి కాగా నిధులు రద్దవడంతో పనులు ప్రారంభం కాలేదు. డోర్నకల్, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీల కార్యాలయాలు జీపీ భవనాల్లోనే కొనసాగుతున్నాయి.
వెంటాడుతున్న సిబ్బంది కొరత
మానుకోట మున్సిపాలిటీకి అధికారులు, సిబ్బంది ఉన్నప్పటికీ పారిశుద్ధ్య కార్మికులు పూర్తి స్థాయిలో లేకపోవడం ఇబ్బందులు పడుతున్నారు. మరిపెడ, తొర్రూరు, డోర్నకల్, కేసముద్రంలో ఇన్‌చార్జ్‌ల పాలన కొనసాగుతోంది.
బిల్లులు రాలేదు..
మానుకోట మున్సిపాలిటీ నూతన భవనానికి కేవలం బిల్లులు రాకనే పనులు నిలిచిపోయాయి. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాం. నిధులు విడుదల కాగానే పనులు పూర్తి అయ్యేలా చూస్తాం. – టి.రాజేశ్వర్,
మానుకోట మున్సిపాలిటీ కమిషనర్

జీపీ భవనాల్లోనే మున్సిపల్ కార్యాలయాలు