
నాణ్యమైన భోజనం అందించాలి
కురవి: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి మాడిశెట్టి నరసింహస్వామి అన్నారు. శనివారం బలపాలలోని ఎస్సీ బాలు ర వసతిగృహం, కురవిలోని ఎస్సీ బాలికల వసతిగృహంలో జరిగిన పీటీఎంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రుల సూచనలను తూచా తప్పకుండా పాటించి భవిష్యత్‌లో అన్ని వసతి గృహాలు సజావుగా నడపడానికి ఎంతో తోడ్పాడునందిస్తామన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలన్నారు.
చదువుతోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్
మరిపెడ రూరల్: చదువుతోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి నర్సింహాస్వామి అన్నారు. మరిపెడ మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో విద్యార్థుల తల్లిదండ్రులతో శనివారం సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా వసతి గృహాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ లా కళాశాల ఐదేళ్ల కోర్సు విద్యార్థుల సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తామని రిజిస్ట్రార్ రామచంద్రం హామీ ఇచ్చారు. ఈనెల 12న ఐదేళ్ల లాకోర్సుల విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేసిన నేపథ్యంలో ఆయా విద్యార్థులతో శనివారం పరిపాలనాభవనం వద్ద చర్చలు జరిపారు. అయినప్పటికీ విద్యార్థులు వినకుండా పరిపాలనా భవనం వద్ద ధర్నా నిర్వహించారు. మళ్లీ కొంతసేపటికి రిజిస్ట్రార్ రామచంద్రం విద్యార్థులతో మాట్లాడారు. వీసీ ప్రతాప్‌రెడ్డి ఈనెల 23న కేయూకు రానున్నారని మీ సమస్యలను వీసీ దృష్టికి తీసుకెళ్లి దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చా రు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించా రు. వినతిపత్రాన్ని రిజిస్ట్రార్ రామచంద్రంకు అందజేశారు. రిజిస్ట్రార్ వెంట పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, యూనివర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుదర్శన్, కేయూ పాలకమండలి సభ్యులు ఆచార్య బి.సురేశ్‌లాల్, లా హాస్టల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ చల్లా శ్రీనివాస్ ఉన్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో.. కేయూ పోలీస్టేషన్ పోలీస్ అధికారులు కూడా అక్కడికి విచ్చేశారు.
రామప్పలో అమెరికన్ల సందడి
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన బ్రాడ్, రాచెల్‌లు శనివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్ అంటూ కొనియాడారు.
హేమాచలక్షేత్రంలో..
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు శనివారం భారీగా తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించి భక్తుల గోత్ర నామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణాన్ని వివరించారు.

నాణ్యమైన భోజనం అందించాలి

నాణ్యమైన భోజనం అందించాలి