
ప్రాణాల మీదకు వస్తున్న యూరియా కొరత
కొత్తగూడ: యూరియా కొరత రైతుల ప్రాణాల మీదకు వస్తోంది. క్యూలో నిల్చున్న రైతులు అనారోగ్యం పాలవుతుంటే.. యూరియా దొరకక కొందరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. కొత్తగూడ, గంగారం మండలాల్లో మొక్కజొన్న, వరి పంటలు ఎక్కువగా సాగవుతుంటాయి. దీంతో యూరియా వినియోగం కూడా ఎక్కువ ఉంటుంది. పంటకు అదనుకు యూరియా వేయకపోతే పంట ఎర్రబడి దిగుబడి తక్కువగా వస్తుంది. తర్వాత యూరియా వేసినా ప్రయోజనం ఉండదు. తాజాగా కొత్తగూడ మండల కేంద్రంలోని బూరుగుగుంపుకు చెందిన మల్లెల నర్సయ్య యూరియా దొరకడం లేదని శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘పొగుళ్లపల్లి సొసైటీ వద్దకు పది రోజులు.. కొత్తగూడలో ఐదు రోజుల పాటు యూరియా కోసం తిరిగినా దొరకలేదు. పంట ఎర్రబడి పోతుంది. ఏం చేయాల్నో తెలువక పురుగుల మందు తాగి సద్దామనుకున్న.. ఎవుసం చేసినోడు సావక ఏం చేయాలె’ అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. అలాగే తెల్లవారుజాము నుంచి లైన్‌లో నిల్చుని అనారోగ్యం పాలైన గాంధీనగర్‌కు చెందిన రామక్క, ఈశ్వరగూడెంకు చెందిన లక్ష్మినర్సులను ఎస్సై రాజ్‌కుమార్ తన వా హనంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఇలా చాలా మంది రైతులు యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నారు.
క్లస్టర్ల వారీగా పంపిణీ చేస్తున్నా..
మండలంలోని పీఏసీఎస్ వద్ద యూరియా పంపిణీ చేయడంతో రైతులు ఎక్కువ సంఖ్యలో రావడంతో సమయం ఎక్కువగా తీసుకుంటుంది. దూర ప్రాంతాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికారులు క్లస్టర్ వారీగా విభజించి పంపిణీ చేస్తున్నారు. అయినా సరిపడా యూరియా లభించకపోవడంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారు. ఇప్పటికై న అధికారులు స్పందించి సకాలంలో యూరియా పంపిణీ చేసి రైతులకు ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
అదనుకు అందకపోవడంతో రైతుల ఆత్మహత్యాయత్నం