
చెట్టు కొమ్మ తొలగిస్తుండగా..
భూపాలపల్లి రూరల్: చెట్టు కొమ్మ తొలగిస్తుండగా ఓ విద్యార్థి విద్యుత్ తీగ తగిలి గాయపడ్డాడు. ఈ ఘటన శనివారం భూపాలపల్లి మండలం గొల్లబు ద్దారం ఎస్సీ హాస్టల్‌లో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం పెద్దకుంటపల్లి గ్రామానికి చెందిన పి. రాజేంద్రన్ గొల్లబుద్దారం ఎస్టీ హాస్టల్‌లో ఉంటూ 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం సెలవు దినం కావడంతో హాస్టల్ పరిసరాలను శుభ్రం చేయాలని వార్డెన్ రాంగోపాల్‌రెడ్డి విద్యార్థులకు సూచించారు. దీంతో కొంత మంది విద్యార్థులు పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. రాజేంద్రన్ వసతి గృహం ఆవరణలో అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించేందుకు చెట్టు ఎక్కాడు. కొమ్మలు కొడుతున్న క్రమంలో చెట్టుపై నుంచి వెళ్లిన విద్యుత్ తీగలకు తాకి కిందపడ్డాడు. వెంటనే సహ విద్యార్థులు కేకలు వేయడంతో హుటాహుటిన సదరు విద్యార్థిని భూపలపల్లిలోని వంద పడకల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి నిలకడగానే ఉంది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు, బీఆర్‌ఎస్పీ, ఎస్‌ఎఫ్‌ఎ విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థి రాజేంద్రన్‌ను పరామర్శించారు. ప్రమాదానికి కారణమైన వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ తీగ తగిలి విద్యార్థికి గాయాలు
గొల్లబుద్దారం ఎస్టీ హాస్టల్‌లో ఘటన