
బంగారమే వృద్ధురాలి ప్రాణం తీసింది..
నెల్లికుదురు: శరీరంపై ఉన్న బంగారమే వృద్ధురాలి హత్యకు కారణమైంది. బంగారం కోసం ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని దుండగులు హత్య చేసి బావిలో పడేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై చిర్ర రమేశ్ బాబు కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన వీరగాని రాధమ్మ(80), హుస్సేన్ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హుస్సేన్ పదేళ్ల క్రితమే మృతి చెందగా కూతుళ్లు, కుమారుల పెళ్లిళ్లు అయ్యాయి. ముగ్గురు కొడుకులు వ్యాపార నిమిత్తం ఇతర గ్రామాల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో రాధమ్మ ఒంటరిగా ఉంటూ కూలీ చేసుకుంటూ జీవిస్తోంది. రాధమ్మ శరీరం మీద సుమారు మూడు తులాల బంగారం, కొంత వెండి ఉంది. ఇది గమనించి దుండగులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో రాధమ్మపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం హత్య చేసి మృతదేహాన్ని ఇంటి ఎదుట ఉన్న బావిలో పడేశారు. శనివారం ఉదయం రాధమ్మ కనిపించకపోవడం.. ఇంటి ఎదుట రక్తపు మరకలు కనిపించడంతో స్థానికులు చూసి రాధమ్మ కుమారులకు సమాచారం అందించారు. పోలీసుల సహకారంతో బావి నుంచి రాధమ్మ మృతదేహాన్ని వెలికితీశారు. మృతురాలి కుమారుడు మలేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
హత్య చేసి బావిలో పడేసిన దుండగులు
నెల్లికుదురులో ఘటన
వివరాలు వెల్లడించిన ఎస్సై రమేశ్ బాబు