వానాకాలం ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం
యాసంగిలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు
లారీలు, గన్నీ సంచుల సరఫరానే కీలకం
ఈ సీజన్ లక్ష్యం 2,89,350 మెట్రిక్ టన్నులు
నవంబర్ నుంచి కొనుగోళ్లు ముందస్తు ప్రణాళిక
సాక్షి, మహబూబాబాద్: ప్రతీ సంవత్సరం మాదిరిగానే వానాకాలం రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే గత యాసంగిలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలనే ఆలోచనతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే గతంలో జరిగిన తప్పులు జరగకుండా మొదటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
2,89,350 మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యం
ఈ వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన మొత్తం ధాన్యంలో 2,89,350 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు జిల్లా సివిల్ సప్లయీస్ మార్కెటింగ్ అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. 8,097 ఎకరాల దొడ్డురకం, 2,15,782 ఎకరాల్లో సన్న రకం మొత్తం 2,23,880 ఎకరాల్లో వరి సాగు చేశారు. దీంతో 17,607 మెట్రిక్ టన్నుల దొడ్డురకం, 4,47,878 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో రైతులు తినడానికి నిల్వ ఉంచుకోవడం, ఇతర మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారుల కొనుగోళ్లు పోగా 17,383 మెట్రిక్ టన్నుల దొడ్డురకం, 2,71,967 మెట్రిక్ టన్నుల సన్నరకం మొత్తం 2,89,350 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే అవకాశం ఉందని వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలో పేర్కొన్నారు.
జిల్లాలో వరి సాగు వివరాలు
వానాకాలం వరి సాగు: 2,23,880 ఎకరాలు
ధాన్యం దిగుబడి అంచనా: 4,65,485 మెట్రిక్ టన్నులు
రైతుల నిల్వ, మిల్లర్లు, ప్రైవేట్ కొనుగోళ్లు: 1,76,135 మెట్రిక్ టన్నులు
ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం: 2,89,350 మెట్రిక్ టన్నులు
గుణపాఠం నేర్చితేనే..
గత యాసంగిలో జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తలెత్తిన సమస్యల నుంచి గుణపాఠం నేర్చుకుంటేనే వానాకాలం కొనుగోళ్లు సజావుగా సాగుతాయని రైతులు చెబుతున్నారు. యసంగిలో 239 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.79లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 44.75లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా జిల్లాలో 22,02,225 సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన 22,72,775 గన్నీలు కావాలని ఉన్నతాధికారులకు ఇండెంట్ పెట్టారు. అదేవిధంగా 9,979 టార్పాలిన్లు, 259 ప్యాడీ క్లీనర్లు, 239 క్యాలీపర్స్, 234 డస్ట్ రిమూవర్స్, 427 తేమ పరిశీలన యంత్రాలు, 921 వెయింగ్ మిషన్లు సిద్ధం చేశారు. అయితే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు పెట్టేందుకు హమాలీల కొరత వెంటాడింది.
కాంటాలు పెట్టిన ధాన్యం వెంటవెంటనే మిల్లులకు తరలించాల్సి ఉండగా.. లారీ సప్లయీస్ కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తక్కువ లారీలను పంపించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. అంచనాలకు మించి 1,76,100 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చింది. దీంతో మరోవైపు గన్నీ బ్యాగుల కొరత వెంటాడింది. దీంతో కల్లంలో కాంటాలు పెట్టేందుకు, కాంటాలు పెట్టిన ధాన్యం లారీల్లో లోడ్ చేసేందుకు నెలల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో కాంటాలు పెట్టిన ధాన్యం వర్షాలకు తడిసి మొలకెత్తిన సంఘటనలు ఉన్నాయి. ఇలా యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రైతులు, అధికారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ వానాకాలం అలా జరగకుండా ముందుగానే లారీలు, గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని రైతులు కోరుతున్నారు.
నవంబర్ నుంచి కొనుగోళ్లు
గతంలో మాదిరిగానే ఈ వానాకాలంలో నవంబర్ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఆలస్యంగా వర్షాలు పడ్డాయి. అయితే బావులు, బోర్లు, ఇతర నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో జూన్, జూలైలో నాట్లు వేయగా.. చెరువులనే నమ్ముకున్న ప్రాంతాల్లో ఆగస్టు చివరి వరకు నాట్లు వేశారు. జిల్లాలో ప్రధానంగా పెద్దవంగర, తొర్రూ రు, దంతాలపల్లి, నెల్లికుదురు, నర్సింహులపేట మండలాల్లోని కొంత భాగం నవంబర్ నుంచి వరికోతలు మొదలయ్యే అవకాశం ఉంది. ఈక్రమంలో నవంబర్ చివరి వారంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తే జనవరి వరకు పూర్తి చేసుకునే అవకాశం ఉంది.