
రైళ్లను పునరుద్ధరించాలి
డోర్నకల్: కరోనా కాలంలో రద్దైన రైళ్లను పునరుద్ధరించాలని డీఆర్‌యూసీసీ సభ్యుడు జె.లచ్చిరాంనాయక్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్ సతీష్‌కుమార్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న లచ్చిరాంనాయక్ పలు రైల్వే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అంందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కాలంలో రద్దైన రైళ్లను పునరుద్ధరించాలని, డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరినట్లు తెలిపారు. డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారాలపై టాయిలెట్ల ఏర్పాటుతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు.
సేంద్రియ పద్ధతుల్లో
సాగు చేపట్టాలి
నెల్లికుదురు: సేంద్రియ పద్ధతులు పాటించి ఎత్తు మడులు, మల్చింగ్ విధానంలో పంటల సాగు చేసి లాభాలు పొందాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జినుగు మరియన్న రైతులకు సూచించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం పర్యటించారు. బోర్లు, బావుల కింద ఆయిల్‌పామ్, కూరగాయలు, పండ్లు, పూలు, పసుపు, మున గ, మల్బరీ పంటలు సాగు చేసి అధిక లాభాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు మానస, విజయ్‌పాల్‌రెడ్డి, అశోక్, హరీశ్, రైతులు రమేశ్, భూషయ్య తదితరులు పాల్గొన్నారు.
విహారయాత్రకు
ఆర్టీసీ ప్రత్యేక బస్సు
నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపో నుంచి విజయవాడ–బాపట్ల బీచ్‌కు ఆర్టీసీ యాత్ర ప్రత్యేక బస్సు ఈ నెల 18న బయలుదేరుతుందని ఆర్టీసీ డీఎం ఎం.శివప్రసాద్ గురువారం తెలిపారు. డిపో నుంచి ఉదయం 4 గంటలకు డీలక్స్ బస్సు బయలుదేరి విజయవాడ కనకదుర్గమ్మ గుడి, బాపట్ల బీచ్‌కు పర్యాటకులను తీసుకెళ్లి అదే రాత్రి 11 గంటలకు మహబూబాబాద్‌కు చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ. 500గా చార్జీలు నిర్ణయించామన్నారు. బుకింగ్ కోసం ఎండి.నబీ 99482 14022 నంబర్‌లో సంప్రదించాలన్నారు. భోజనం, రూమ్ సదుపాయాలు యాత్రికులే భరించాలన్నారు.
పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలి
మహబూబాబాద్ అర్బన్ : జిల్లాలోని అన్ని ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో ఈ నెల 13న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి ఎం.నర్సింహస్వామి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించాలని, మంచిచెడులు వివరించాలన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తున్న సంక్షేమాలు, నూతన డైట్ మెనూ గురించి తెలియజేయాలన్నారు. ఈ సమావేశానికి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మెడికల్ ఆఫీసర్స్, సిబ్బంది, వార్డెన్లను ఆహ్వానించాలన్నారు.
విద్యుత్ అంతరాయాలు లేకుండా చూస్తాం
మహబూబాబాద్ రూరల్: విద్యుత్ అంతరాయాలు తగ్గించి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు 11కేవీ లింక్ లైన్ ఏర్పాటు చేశామని జిల్లా విద్యుత్‌శాఖ ఎస్‌ఈ విజేందర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ మండలంలోని దర్గా తండా జీపీ పరిధిలోని రేగడిగూడెం గ్రామంలో 11కేవీ లింక్ లైన్‌ను గురువారం ప్రారంభించి మాట్లాడారు. నూతన 11 కేవీ లింక్ లైను లక్ష్మీపురం, లక్ష్మీపురం తండా, లాక్య తండా, దర్గా తండా, కొమ్ముగూడెం గ్రామాలను కలుపుతూ నిర్మాణం చేపట్టామన్నారు. తద్వారా రంగాపురం సబ్ స్టేషన్ పరిధిలోని వేమునూరు ఫీడర్‌పై గల 30శాతం లోడ్‌ను నడివాడ ఫీడర్‌పైకి మారిందన్నారు. పొలంబాట కార్యక్రమం చేపట్టి విద్యుత్ వినియోగదారులు, రైతులకు విద్యుత్ ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో డీఈ విజయ్ కుమార్, ఏడీఈ ప్రశాంత్, ఏఈ వెంకటేశ్వర్లు, విద్యుత్ సిబ్బంది, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.