
ఎన్నికలకు సర్వం సిద్ధం
తుది ఓటరు జాబితా విడుదల
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తుది ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో జెడ్పీ సీఈఓ పురుషోత్తం పర్యవేక్షణలో రూపొందించిన తుది ఓటరు జాబితాను ఎంపీడీఓల ఆధ్వర్యంలో ప్రదర్శించారు. 10 రోజుల నుంచి చేపడుతున్న కసరత్తు తుది ఓటరు జాబితా వెల్లడితో ముగిసిందని అధికారులు పేర్కొంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓటరు జాబితాను మండలాల వారీగా విడుదల చేశారు.
18 జెడ్పీటీసీ, 193 ఎంపీటీసీ స్థానాలు..
జిల్లాలో 18 మండలాల్లో 18 జెడ్పీటీసీలు, 193 ఎంపీటీసీలు స్థానాలను ఖరారు చేశారు. ఒక్కో ఎంపీటీసీ పరిధిలో జనాభా ప్రకారం రెండు, మూడు జీపీలు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో 5,56,780 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 2,73,692మంది, మహిళా ఓటర్లు 2,83,064మంది ఉన్నారు. 1,066 పోలింగ్ బూత్ లను అధికారులు ఏర్పాటు చేశారు. గత ఏడాది జెడ్పీ, మండల పరిషత్‌ల కాలపరిమితి ముగిసింది. కాగా జిల్లా పరిషత్‌కు కలెక్టర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించగా.. మండల పరిషత్‌లకు జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేకాధికారులుగా వ్యవహస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మండలాలు, గ్రామాల్లో తాగు నీటి సరఫరా, రోడ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, మరుగుదొడ్లు, బ్రిడ్జిలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సీసీ రోడ్లు, దళిత వాడలు, గిరిజన తండాల అభివృద్ధి తదితర నిర్మాణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు వచ్చేవి. పాలకవర్గాలు లేకపోవడంతో నిధులు నిలిచిపోయాయి. ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేస్తే నిధులు సమకూరి గ్రామాలు, తండాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో 193 ఎంపీటీసీ, 18 జెడ్పీటీసీ స్థానాలు
మొత్తం 5,56,780 మంది ఓటర్లు

ఎన్నికలకు సర్వం సిద్ధం