
కొడుకు చంపుతాడనే భయంతో..
వెంకటాపురం(ఎం): మద్యానికి బానిసై, ఆన్‌లైన్ బె ట్టింగ్‌లతో అప్పుల పాలైన కుమారుడు తనను ఎ క్కడ చంపుతాడనే భయంతో తండ్రే తన కుమారుడిని హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ మేరకు మంగళవారం ములుగు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ములుగు సీఐ దారం సురేశ్, వెంకటాపురం ఎస్సై చల్ల రాజు వివరాలు వెల్లడించారు. వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన రిటైర్డ్ టీచర్ దుర్గం సూరయ్యకు ఇద్దరు కుమారులు సంపత్, అశోక్ (32) ఉన్నారు. సూరయ్య ప్రస్తుతం ములుగు మండలం రంగారావుపల్లి శివారులో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో సూరయ్య చిన్న కుమారుడు అశోక్ మద్యానికి బానిసై ఆన్‌లైన్ బెట్టింగ్‌లో తీవ్రంగా నష్టపోయి తన వాటాగా వచ్చిన రెండు ఎకరాల భూమిని అమ్ముకున్నాడు. ఈనెల 7న లక్ష్మీదేవిపేట నుంచి రంగారావుపల్లిలో నివాసముంటున్న తండ్రి సూరయ్య వద్దకు వెళ్లి మద్యం మత్తులో ఎలాగైనా నిన్ను ఈరోజు చంపుతానంటూ బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన సూరయ్య తన పెద్దకుమారుడు సంపత్, తమ్ముడు సాంబయ్య సాయంతో అశోక్ మెడకు తాడు చుట్టి చంపేశాడు. అనంతరం డ్రైవర్ రమేశ్ సాయంతో అశోక్ మృతదేహాన్ని కారులో రంగారావుపల్లి నుంచి తీసుకుని తాను ఉంటున్న ఇంటి వద్ద పడేశాడు. ఈ ఘటనపై లక్ష్మీదేవిపేటకు చెందిన ఓ వ్యక్తి సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ, ఎస్సై తెలిపారు.
కుమారుడిని హత్య చేసిన తండ్రి
ఈ ఘటనలో తండ్రితోపాటు
సహకరించిన ముగ్గురి అరెస్ట్
వివరాలు వెల్లడించిన పోలీసులు