
అన్నారం బ్యారేజీలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం అన్నారం బ్యారేజీలో నాటు పడవ నడుపుతూ వెళ్లి పియర్ (పిల్లర్)కు తగిలి గోదావరిలో గల్లంతైన గడ్డం వెంకటేశ్(46 మృతదేహం మంగళవారం లభ్యమైంది. కాళేశ్వరం ఎస్సై తమాషారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా మండలిపురానికి చెందిన ఇద్దరు మత్స్యకారులు గడ్డం వెంకటేశ్, తుముకూరి కృష్ణస్వామి మంచిర్యాల జిల్లా పొక్కూర్ వద్ద నాటు పడవ కొనుగోలు చేసి గోదావరి మీదుగా నడుపుకుంటూ సోమవారం అన్నారం బ్యారేజీ చేరుకున్నారు. అన్నారం బ్యారేజీ 11వ పియర్ వద్ద గేటు దాటే క్రమంలో ప్రవాహానికి ఒక్కసారిగా పడవ బోల్తాపడింది. దీంతో వెంకటేశ్ గోదావరిలో మునిగి గల్లంతు కాగా, కృష్ణస్వామి ఈదుకుంటూ బయటకు ప్రాణాలతో వచ్చాడు. రాత్రి వరకు పోలీసులు, జాలర్లు ఎంత వెలికినా ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం మధ్యాహ్నం వెంకటేశ్ మృతదేహం లభ్యమైంది. కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో మృతుడి సోదరుడు గడ్డం లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహానికి మహదేవపూర్ సీహెచ్‌సీలో పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.