
స్కూల్‌వ్యాన్ డ్రైవర్ నిజాయితీ
● రూ.52 వేలు అప్పగింత
మహబూబాబాద్ రూరల్ : నగదుతో దొరికిన బ్యాగును బాధితుడికి అప్పగించి ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు.మహబూబాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కి చెందిన వ్యాన్ సోమవారం సాయంత్రం పిల్లలను ఇంటివద్ద వదిలేందుకు వేమనూరుకు వెళ్లింది. తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డుపై ఒక బ్యాగ్ కనిపించడంతో డ్రైవర్ పొదిల ఆంజనేయులు వ్యాన్‌ను నిలిపి దానిని తీసుకుని చూడగా అందులో రూ.52 వేల నగదు ఉంది. వెంటనే తీసుకువెళ్లి ఆ పాఠశాల కరెస్పాడెంట్ బూర పూర్ణచందర్‌కు తెలియజేశాడు. మంగళవారం వేమనూరు గ్రామంలో పిల్లల్ని తీసుకొచ్చేందుకు వెళ్లగా గ్రామస్తులకు దొరికిన బ్యాగ్ విషయం తెలియజేశాడు. సాయంత్రం వేమునూరు దగ్గరలో ఉన్న రాములు తండాకు చెందిన గుగులోత్ ప్రవీణ్ ఆ బ్యాగు తనదేనని పాఠశాలకు ఫోన్ చేసి చెప్పాడు. డైరెక్టర్ పూర్ణచందర్, ప్రిన్సిపాల్ హిమబిందు, డ్రైవర్ ఆంజనేయులు.. ప్రవీణ్‌కు రూ.52 వేల నగదు అప్పజెప్పారు. దీంతో ప్రవీణ్ ఆంజనేయులుని, యాజమాన్యానికి, సహకరించిన టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు.