
జీపీఓలు వస్తున్నారు..
సాక్షి, మహబూబాబాద్: ఇంతకాలం గ్రామ రెవెన్యూ వ్యవస్థను పట్టించుకునే వారు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రస్తుతం వారి ఇబ్బందులను తొలగించేందుకు మళ్లీ గ్రామ పరిపాలనాధికారుల నియామకం వేగవంతంగా జరుగుతోంది. కాగా, గతంలో వీఆర్వో, వీఆర్‌ఏలుగా పనిచేసిన వారినే జీపీఓలుగా నామకరణం చేసి .. బాధ్యతల్లో కొంత మేర మార్పులు చేసి గ్రామాలకు పంపిస్తున్నారు. పాతవారే అయినప్పటికీ పనితీరులో కొత్తదనం ఉంటుందని.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పనులు చేయాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.
గ్రామస్థాయిలో మళ్లీ సేవలు
గ్రామస్థాయిలో సమస్యలు వస్తున్నాయని 2020 ఏడాదిలో గత ప్రభుత్వం వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసింది. అప్పటి నుంచి గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేకుండా పోయింది. ఈక్రమంలో పలు సమస్యలు పేరుకుపోయాయి. వీటికి పరిష్కారం లభించకపోవడంతో ఇటు ప్రజలు.. అటు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతీ చిన్న సమస్యకు గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యార్థులకు కావాల్సిన సర్టిఫికెట్ల నుంచి భూ సమస్యల పరిష్కారం వరకు తహసీల్దార్ కార్యాలయాలే దిక్కయ్యాయి. అన్ని సమస్యల పరిష్కారంలో రెవెన్యూ వ్యవస్థ కీలకం. ఆ వ్యవస్థ గ్రామస్థాయిలో నిర్వీర్యమైంది. ప్రస్తుతం జీపీఓల నియామకంతో భూ రికార్డుల పరిరక్షణ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వ ఏజెంట్లుగా మారి ప్రజలకు అండగా నిలుస్తారు. వారికి పునరావాసం కల్పిస్తారు. ప్రజల చర, స్థిర ఆస్తుల పరిరక్షణకు పనిచేస్తారు. ఎన్నికల సందర్భంగా బీఎల్‌ఓలుగా ఉంటారు. ఓటరు జాబితా తయారీలో కీలకంగా వ్యవహరిస్తారు. ప్రతీ ఎన్నికకు గ్రామాల్లో ఏర్పాట్లు చేస్తారు. శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడతారు. సంక్షేమ ఫలాలు అమలు చేసేందకు నివేదికలు అందిస్తారు.
నియామక ప్రక్రియ షురూ..
గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, నూతన భూభారతి చట్టం అమలుకు గ్రామస్థాయిలో జీపీఓలను నియమించారు. జిల్లాలో 18 మండలాలు, 473 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో రెవెన్యూ గ్రామాలు(క్లస్టర్లు) 180 ఉన్నాయి. వీటికి ఇప్పటికే వ్యవసాయశాఖ పరిధిలో ఏఈఓలను నియమించారు. అయితే భూముల క్రయ విక్రయాలు, హద్దులు, భూమి స్వభావం వంటి వివరాల తెలుసుకోవడం, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రతీ క్లస్టర్‌కు ఒక జీపీఓను నియమించాలని ప్రభుత్వం భావించింది. దీనిలో భాగంగా గతంలో వీఆర్వో, వీఆర్‌ఏగా పనిచేసిన వారికి జీపీఓలుగా అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. వెనక్కి వచ్చిన వారికి పరీక్ష నిర్వహించారు. ఇందులో 151 మంది పరీక్ష రాయగా.. ఐదుగురు వెనక్కి తగ్గారు. మిగిలిన 147 మందికి జీపీఓలుగా నియామక పత్రం అందజేసే ప్రక్రియ మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కొససాగింది. మెరిట్ జాబితాతో పాటు, దివ్యాంగులు, స్పౌజ్, ఇతర ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకొని పోస్టింగ్‌లు ఇస్తున్నారు. మిగిలిన 33 క్లస్టర్లకు ప్రస్తుతం రెవెన్యూశాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించి.. ప్రభుత్వ నిర్ణయం మేరకు పనిచేయించేలా చూస్తున్నారు.
రెండు, మూడు రోజుల్లో విధుల్లోకి..
ప్రజలకు రెవెన్యూ, ఇతర సేవలు చేరువలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం జీపీఓల నియామకం చేపడుతోంది. మెరిట్, ఇతర ప్రభుత్వ నిబంధనల మేరకు పోస్టింగ్‌లు ఇస్తున్నాం. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసుకొని రెండు, మూడు రోజుల్లో జీపీఓలు విధుల్లో చేరుతారు. వీరి ద్వారా మరింత మెరుగైన సేవలు అందుతాయి.
–అనిల్ కుమార్, అదనపు కలెక్టర్
పాత వీఆర్వో, వీఆర్‌ఏలే
గ్రామ పాలనాధికారులు
జిల్లా వ్యాప్తంగా 147 మంది
నియామకం
క్లస్టర్ల వారీగా బాధ్యతలు
మిగిలిన గ్రామాల్లో
జూనియర్ అసిస్టెంట్లకు అప్పగింత

జీపీఓలు వస్తున్నారు..

జీపీఓలు వస్తున్నారు..