
క్యాన్సర్ పేషెంట్లకు ఊరట
నెహ్రూసెంటర్: జిల్లాలోనే క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందనుంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయగా.. మంగళవారం హైదరాబాద్ నుంచి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వర్చువల్‌గా ప్రారంభించారు. కాగా జిల్లాలో 765 మంది పలు రకాల క్యాన్సర్ వ్యాధుల బాధపడుతున్నారు. వీరంతా హైదరాబాద్ వంటి నగరాల్లోని పెద్దాసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్థానికంగా వైద్యం అందనుండడంతో బాధితులకు ఉపశమనం కలగనుంది. కాన్సర్ సర్జరీ చేసుకున్నవారికి కీమోథెరిపీ చికిత్స చేసేలా ఆస్పత్రిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
ప్రత్యేక వార్డు, బెడ్లు...
క్యాన్సర్‌కు చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రిలో 20 బెడ్లు, ఐదుగురు వైద్యులు, ఐదుగురు నర్సులు, పేషెంట్‌కేర్, సిబ్బందిని కేటాయించారు. క్యాన్సర్ సర్జరీల తర్వాత వ్యాధిగ్రస్తులకు నా ణ్యమైన వైద్యం, మందులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని వ్యాధిగ్రస్తులు ఇకపై ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా చికిత్స పొందనున్నారు.
వర్చువల్‌గా వార్డును ప్రారంభించిన మంత్రి..
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో క్యాన్సర్ చికిత్స వార్డును హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రికి అనుసంధానంగా పని చేస్తుందని, క్యాన్సర్ పేషెంట్లను అడ్మిట్ చేసుకుని కీమోథెరపీ అందించి డిశ్చార్జ్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. క్యాన్సర్ వార్డు ప్రారంభంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పాల్గొని క్యాన్సర్ బాధితులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జీఎంసీ ప్రిన్సిపల్ వెంకట్ లకావత్, డాక్టర్ గోదాదేవి, నాగరాజు, అనస్తీషియా డాక్టర్‌సునీల్, డాక్టర్ కోటేశ్వర్‌రావు, ఆర్‌ఎంఓలు జగదీశ్వర్, హర్షవర్ధన్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
జీజీహెచ్‌లో ప్రత్యేక క్యాన్సర్ వార్డు, వైద్యులు, సిబ్బంది నియామకం
వర్చువల్‌గా వార్డును ప్రారంభించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
అందుబాటులోకి కీమోథెరపీ చికిత్స
జిల్లాలో 765 మంది బాధితులు
జిల్లాలో క్యాన్సర్ బాధితుల వివరాలు ..
బ్రెస్ట్ క్యాన్సర్ 255
క్రానికల్ 205
ఓరల్ 93
గొంతు 46
యూట్రస్ 47
బ్లడ్ 22
ఇతర పలరకాల క్యాన్సర్ 97
బాధితులు సద్వినియోగం చేసుకోవాలి
జీజీహెచ్‌లో క్యాన్సర్ బాధితులకు కీమోథెరపీ చికిత్స అందించేందుకు ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ క్యాన్సర్ వార్డును ప్రారంభించారు. జిల్లాలో ఉన్న బాఽధితులు సద్వినియోగం చేసుకోవాలి. జీజీహెచ్‌లో ఉచితంగా చికిత్సను అందజేయడం జరుగుతుంది.
– శ్రీనివాసరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్
చికిత్స అందించడం సంతోషకరం
జిల్లాలో క్యాన్సర్ చికిత్సను అందించడం సంతోషకరం. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు వ్యాధితో ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయడం సంతోషకరం. ప్రజలకు అన్ని రకాల చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడం హర్షనీయం.
– సిరిపురం వీరన్న, మానుకోట

క్యాన్సర్ పేషెంట్లకు ఊరట

క్యాన్సర్ పేషెంట్లకు ఊరట