
కలెక్టరేట్‌లో కాళోజీ జయంతి
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో మంగళవారం ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి కార్యక్రమం నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అధికారులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కాళోజీ చరిత్రను ప్రతీ ఒక్కరు అధ్యయనం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నర్సింహస్వామి పాల్గొన్నారు.
కూరగాయల సాగుతో అధిక లాభాలు
నెల్లికుదురు: కూరగాయల సాగుతో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న రైతులకు సూచించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సాగులో ఉన్న ఆయిల్ పామ్, కూరగాయల పంటలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మరియన్న మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగుతో ఎకరానికి ఏటా రూ.1.50లక్షల ఆదాయం పొందవచ్చన్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో ఆయిల్‌పామ్, పండ్ల తోటలు, కూరగాయలు, మల్బరీ, పూలు, మునగ పంటలను రైతులు సాగు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ పంటలపై మక్కువ పెంచుకుని సాగు చేసి అధిక లాభాలు పొందాలని కోరారు.
డోర్నకల్‌లో గౌతమి, చార్మినార్ రైళ్లకు హాల్టింగ్
డోర్నకల్: డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో బుధవారం నుంచి గౌతమి, చార్‌మినార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించనున్నారు. కాకినాడ–లింగంపల్లి, లింగంపల్లి–కాకినాడ గౌతమి ఎక్స్‌ప్రెస్, తాంబరం–హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు స్టేషన్‌లో హాల్టింగ్ కల్పిస్తున్నట్లు డీఆర్‌యూసీసీ సభ్యులు లచ్చిరాంనాయక్, ఖాదర్ మంగళవారం తెలిపారు.
కేయూ వీసీ
అమెరికా పర్యటన
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి ఈనెల 12 నుంచి 20వ తేదీవరకు అమెరికా అధికార పర్యటన చేస్తారని రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం మంగళవారం తెలిపారు. అమెరికాలోని న్యూజెర్సీ అట్లాంటాలో నిర్వహించనున్న కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఫార్మసీ విభాగం చాప్టర్ సమ్మేళనంలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని, టెక్సాస్‌లోని ఏ అండ్ ఎం యూనివర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మకాలజీ అండ్ న్యూరో థెరిప్యూటిక్స్‌తో ఒక అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంటారని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం విద్య, పరిశోధన రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు వివరించారు. రెండు విశ్వవిద్యాలయాల మధ్య పరిశోధనల మార్పిడి మరింతగా సులభతరం అవుతుందని తెలిపారు.
పూజారుల అభిప్రాయం మేరకే గద్దెల మార్పు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను పూజారుల అభిప్రాయాల మేరకే మార్పు చేస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు చందా రఘుపతి, కొక్కెర రమేష్, కాక సారయ్య, కాక వెంకటేశ్వర్లు, దబ్బగట్ల గోవర్ధన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మక్క–సారలమ్మ గద్దెలతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను భక్తులు దర్శించుకునే సమయంలో ఎదురుపడి ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. జంపన్నవాగు నుంచి వచ్చే భక్తులు టీటీడీ కల్యాణ మండపం వెనుకాల క్యూలైన్, ఆర్టీసీ బస్టాండ్ క్యూలైన్ ద్వారా వచ్చే భక్తులు మీడియా పాయింట్ సమీపంలోని ఎంట్రెన్స్ ద్వారం నుంచి ఒక్కసారిగా గద్దెల ప్రాంగణంలోకి రావడంతో తొక్కిసలాట జరిగి ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. ఈమేరకు రెండు గద్దెలను మార్పు చేయాలని ఆలోచన చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. గోవిందరాజు, పగిడిద్దరాజుల మూలలను ముట్టుకోకుండా గద్దెల స్థానం మార్పు అనేది పూర్తిగా పూజారుల అనుమతి, అంగీకారాలతోనే జరుగుతుందన్నారు.

కలెక్టరేట్‌లో కాళోజీ జయంతి