
మహిళ హత్య ఘటనలో నిందితుడి అరెస్ట్
మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం సమీపంలో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం మరిపెడ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మరిపెడ మండలం ఉల్లెపల్లికి చెందిన బంటు వెంకటమ్మ(55) వ్యవసాయ కూలి మేసీ్త్రగా జీవనం కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమెకు సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వాయిలసింగారం గ్రామానికి చెందిన తాపీమేసీ్త్ర సాగల వీరన్నతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో వీరన్నకు మృతురాలు అప్పుడప్పుడు అప్పు ఇచ్చేది. ఈ క్రమంలో గత నెల ఆగస్టు 31వ తేదీన తనకు అప్పు కావాలంటూ వీరన్న.. మృతురాలికి ఫోన్ చేసి మరిపెడకు రాగా ఇద్దరు కలుసుకున్నారు. అనంతరం మద్యం కొనుగోలు చేసి పురుషోత్తమాయగూడెం శివారుకు వెళ్లారు. అక్కడ మద్యం సేవించిన తర్వాత వీరన్న డబ్బులు అడిగాడు. అయితే మృతురాలు తన దగ్గర లేవని చెప్పింది. దీంతో వీరన్న.. ఆమె శరీరంపై ఉన్న నగలు బలవంతంగా లాక్కొంటుండగా ప్రతిఘటించింది. ఈ క్రమంలో మద్యం సీసాతో ఆమె ముఖంపై దాడి చేశాడు. అనంతరం గొంతు నులిమి హతమార్చి పక్కన ఉన్న నీటిగుంటలో పడేశాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మరిపెడ సీఐ రాజ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో కేవలం వారం రోజుల్లోనే కేసును ఛేదించారు. నిందితుడి దగ్గర నుంచి నాలుగుతులాల బంగారు ఆభరణాలు, బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. కాగా, సీఐ రాజ్‌కుమార్‌గౌడ్‌తో పాటు ఎస్సై బొలగాని సతీశ్, కానిస్టేబుళ్లు రమేశ్, స్వామి, వేణు, మహేశ్, రమ్య, శాంత, డ్రైవర్ సందీప్‌ను డీఎస్పీ అభినందించారు.
వివరాలు వెల్లడించిన తొర్రూరు
డీఎస్పీ కృష్ణకిశోర్