
తల్లిదండ్రులను ఒప్పించి.. విద్యార్థుల సంఖ్య పెంచి
దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు వేముల గంగాధర్ విద్యార్థుల సంఖ్య పెంచారు. నెక్కొండ ప్రాథమిక పాఠశాల నుంచి గతేడాది బదిలీపై ఇక్కడకు వచ్చిన ఆయన పూర్వవిద్యార్థుల సహకారంతో విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించారు. మెరుగైన బోధన చేస్తామని, ఒక సంవత్సరం అవకాశం ఇవ్వాలని వారిని కోరారు. ఇలా విద్యార్థుల సంఖ్య 10 నుంచి 36 వరకు పెంచారు. అదేవిధంగా 10 మంది ఐదేళ్ల చిన్నారులు కూడా ప్రీప్రైమరీ స్కూల్‌కు వచ్చే విధంగా ఆయన కృషిచేశారు. పూర్వ విద్యార్థులు, దాతల సహకారంలో ఐడెంటిటీ కార్డులు, టైలు, బెల్టులు అందించారు. ఇక తమ గ్రామ ఉన్నత పాఠశాలకు బేస్ గట్టిగా ఏర్పడింది. మరో ఐదేళ్ల పాటు బడి బతుకుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు.