
సులభ గణితం.. ఆ సార్ స్పెషాలిటీ
జనగామ రూరల్: ఈ ఫొటోలో విద్యార్థులతో కనిపిస్తున్న ఉపాధ్యాయుడి పేరు అల్లూరి రవీందర్. జనగామ మండలం ఓబుల్ కేశ్వాపూర్ జెడ్పీ హైస్కూల్‌లో గణిత శాస్త్రం బోధిస్తున్నారు. పాఠశాల స్థాయిలో పిల్లలకు గణితం అంటే భయం. వారిలో ఆ భయాన్ని తొలగిస్తేనే ఆ శాస్త్రం నేర్చుకోవడానికి ఆసక్తి కనబర్చుతారు. దీనిని గమంచిన టీచర్ రవీందర్.. 12 సంవత్సరాల నుంచి గణితం సులువుగా అర్థమయ్యేందుకు ఆ శాస్త్ర నమూనాలు తయారు చేసి బోధిస్తున్నారు. బట్టిపట్టే విధానం కాకుండా కృత్యాధార పద్ధతిలో గణితం బోధించడం ఆయన ప్రత్యేకత. 200కి పైగా గణిత మోడల్స్ తయారు చేసి బోధన సమయంలో ఉపయోగిస్తున్నానని రవీందర్ చెబుతున్నారు. కాగా, బెంగళూరు, చైన్నెలో జరిగిన సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో రవీందర్ రెండు సార్లు బహుమతులు గెలుచుకున్నారు.