
‘ఇందిరమ్మ’ ఇబ్బందులు
సాక్షి, మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో టెక్నికలు సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా లొకేషన్ సమస్య వల్ల అధికారులు ముగ్గులు పోయడం లేదు. అలాగే లబ్ధిదారులకు బిల్లులు రావడం లేదు. సమస్యలు పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని లబ్ధిదారులు వాపోతున్నారు.
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ..
ఇందిరమ్మ ఇల్లు మంజూరై పనులు చేపడుతున్న క్రమంలో ఆన్‌లైన్‌లో తప్పులు చూపడంతో సరిచేయాలని లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 7,946ఇళ్లు ప్రారంభించారు. ఇందులో 5,238 ఇళ్లు బేస్‌మెంట్ వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. వీరిలో 4,600 మందికి మొదటి విడత రూ.లక్ష బిల్లు వచ్చింది. 165 మందికి రెండో విడత బిల్లు వచ్చింది. 638 మంది లబ్ధిదారులు బేస్‌మెంట్ లెవల్ వరకు నిర్మాణం పూర్తి చేసుకున్నా ఆన్‌లైన్ తప్పులతో బిల్లులు రావడం లేదు. మరో 250 మంది ఇళ్లు లొకేషన్ చూపించడం లేదని ప్రారంభం కాలేదు. ఆన్‌లైన్ సమస్య ఉందని చెప్పడంతో మండల, జిల్లా, రాష్ట్ర కార్యాలయాల చుట్టూ లబ్ధిదా రులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కాగా, అధికారులు స్పందించి తప్పులను సరిచేసి బిల్లులు మంజూరయ్యేలా చూడాలని కోరుతున్నారు.
అన్ని సమస్యలు పరిష్కారం
అవుతాయి
అన్‌లైన్‌లో ఎంట్రీ సందర్భంగా జరిగిన తప్పులతో బిల్లులు రావడం లేదు. వీటిని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే కొన్ని సరిచేసి బిల్లులు ఇచ్చాం. లొకేషన్ తేడా, ఇతర సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయి. ఇల్లు కట్టిన వారికి తప్పకుండా బిల్లు వస్తుంది.
–వి.హనుమ, పీడీ హౌసింగ్
తప్పులు కొట్టి తిప్పలు పెడుతున్నారు
ఇల్లు మంజూరు సందర్భంగా నా ఆధార్ పేరులో మా భార్య పేరు నమోదు చేశారు. ఇల్లు ప్రారంభించిన తర్వాత ఫొటో దింపాలని అడిగితే తప్పులు ఉన్నాయని చెబుతున్నారు. తప్పులు సరి చేయాలని ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్తే కలెక్టర్ ఆఫీస్‌కు వెళ్లమని చెబుతున్నారు. తప్పులు సరిచేసి బిల్లులు ఇప్పించండి. –పొలెపల్లి ఆగయ్య, పెద్దముప్పారం
పాత ఇళ్లు కూల్చిన తర్వాత లొకేషన్ రావడం లేదని సాకులు
బేస్‌మెంట్ వరకు నిర్మాణం చేపట్టినా బిల్లుల్లో జాప్యం
టెక్నికల్ సమస్య అంటూ
చేతులెత్తేసిన అధికారులు
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణ
‘డోర్నకల్ మండలం యన్నారం గ్రామంలో 29 ఇళ్లు మంజూరు అయ్యాయి. అందరు బేస్‌మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేశారు. వీరికి రూ.లక్ష బిల్లు రావాల్సి ఉంది. అయితే ఇందులో 15 మంది లబ్ధిదారుల ఇంటి వద్ద బేస్‌మెంట్ బిల్లుకోసం ఫొటోలు తీస్తుంటే లొకేషన్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. దీంతో మీకు బిల్లులు పడవని చెప్పి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.. రూ. 3లక్షల మేరకు అప్పులు చేసి బేస్‌మెంట్ వరకు నిర్మాణం చేపడితే మొదటి బిల్లే రాలేదని.. అసలు ఇల్లుకు బిల్లులు వస్తాయో.. రావో అని భయం అవుతుందని గ్రామస్తులు వాపోయారు.’

‘ఇందిరమ్మ’ ఇబ్బందులు

‘ఇందిరమ్మ’ ఇబ్బందులు