
నాణ్యమైన భోజనం అందించాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
కురవి: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల నూతన భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆశ్రమ పాఠశాలలోని పరిసరాలు, కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులు, టాయ్‌లెట్స్, కిచెన్‌షెడ్, డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. ల్యాబ్‌లో పిల్లలు కంప్యూటర్ విద్యను అభ్యసిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ప్రభుత్వం కల్పించిన డిజిటల్ తరగతులను ఉపయోగించి విద్యార్థినుల ప్రతిభను వెలికితీయాని సూచించారు. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల నూతన భవనాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వార్డులు ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్, సాధారణ ప్రసవాల వివరాలు, స్టోర్‌గది, సిబ్బంది హాజరుపట్టికలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ, ఎంపీడీఓ వీరబాబు, వైద్యాధికారి విరాజిత పాల్గొన్నారు.