
గుంతలమయంగా రహదారులు
● ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
బయ్యారం: ఇటీవల కురిసిన వర్షాలతో మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులు గుంతలమయంగా మారాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహం ఎదుట, బండ్లమాంబ ఆలయం సమీపంలో ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో వాహనాలు దిగబడిన ఘటనలు ఉన్నాయి. అలాగే ఇల్లెందు –మహబూబాబాద్ ప్రధాన రహదారిపై కొత్తపేట సబ్‌స్టేషన్ వద్ద ఏర్పడిన గుంతలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. వీటితో పాటు బయ్యారం నుంచి వెంకట్రాంపురం, బాలాజీపేట, గౌరారం, వినోభానగర్ వెళ్లే రహదారితో పాటు పలు పంచాయతీల్లోని అంతర్గత రహదారులు గుంతలమయంగా మారి వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.