
12న ఆర్టీసీల పరిరక్షణ దినం
న్యూశాయంపేట: దేశంలోని 59 ఆర్టీసీ (రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్)లను పరిరక్షించాలనే డిమాండ్‌తో ఈనెల 12వ తేదీన చేపట్టనున్న ఆర్టీసీల పరిరక్షణ దినాన్ని(సేవ్ ఆర్టీసీ) విజయవంతం చేయాలని వరంగల్ రీజియన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు టి.ఎల్లయ్య, ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ రాంనగర్‌లోని సుందరయ్యభవన్‌లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. ఆర్టీసీలకు సంబంధించి కొన్ని విలువైన భూములు ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోని దాదాపు 59 ఆర్టీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వడం లేదని, ఫలితంగా ఆర్టీసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. దీంతో కార్మికులు పని భారం పెరిగి అనారోగ్యాల పాలు అవుతున్నారన్నారు. అందుకోసం ఈనెల 12న ఆర్టీసీల మనుగడ కోసం ‘ఆర్టీసీల పరిరక్షణ దినం’ (సేవ్ ఆర్టీసీ)డిమాండ్ డే పాటించాలని, ఆ రోజున కార్మికులందరూ నిరసన బ్యాడ్జీలు ధరించి విధుల కు హాజరు కావాలని కోరారు. రీజియన్ కార్యదర్శి బి.ఉపేంద్రాచారి, ఉపాధ్యక్షులు ఎన్.శ్రీనివాస్, పి.మహేందర్, కొమ్మాలు, ఎండి.పాషా, సాధిక్, రవి, సంపత్, శ్రీనివాస్, రమణ, తదితరులు పాల్గొన్నారు.