
చాక్లెట్ కొనుక్కొని వస్తూ మృత్యుఒడికి..
గోవిందరావుపేట: చాక్లెట్ కొనుక్కొని వస్తూ ఓ బాలుడు మృత్యుఒడికి చేరాడు. లారీ ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన గురువారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గోవిందరావుపేటకు చెందిన చెన్ను నర్సింహరావు తన ఇంటి నిర్మాణం కోసం ఇటుక ఆర్డర్ చేయడానికి వెళ్లే క్రమంలో తోడుగా మనువడు కొప్పనాతి హర్షసాయి (4)ని వెంట తీసుకెళ్లాడు. ఈ క్రమంలో హర్షసాయి కిరాణా షాపులో చాక్లెట్లు తీసుకుని రోడ్డు దాటుతున్నాడు. ఈ సమయంలో ఏటూరునాగారం నుంచి వరంగల్ వైపునకు వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నెల క్రితం రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఇదే ప్రదేశంలో అల్లే వెంకటేష్ (17) మృతి చెందాడు. ఈ ప్రాంతంలో తరచూ రహదారి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ప్రమాదాల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
లారీ ఢీకొని బాలుడి దుర్మరణం
గోవిందరావుపేటలో ఘటన