మహబూబాబాద్: గణేశ్ నిమజ్జనానికి శాఖ పరంగా కేటాయించిన పనులు సకాలంలో పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ టి. రాజేశ్వర్‌రావు సిబ్బందిని ఆదేశించారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం నిమజ్జనం ఏర్పాట్లపై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిమజ్జనం రోజున సిబ్బందికి కేటాయించిన విధుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. వినాయక మండపాల వద్ద ఉత్సవ కమిటీ సభ్యులకు సహకరించాలన్నారు. పారిశుద్ధ్య సమస్య లేకుండా చూడాలని ఆకస్మిక తనిఖీ చేసిన క్రమంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయన్నారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈసారి నిజాం చెరువులో నిమజ్జనం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో డీఈ సీహెచ్ ఉపేందర్, మేనేజర్ శ్రీధర్, టీపీఓ సాయిరాం, ఏఈ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయస్థాయి బాస్కెట్‌బాల్
పోటీలకు ఎంపిక
మహబూబాబాద్ అర్బన్: పంజాబ్ రాష్ట్రంలో ఈనెల 2 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ పోటీలకు జిల్లా కేంద్రానికి చెందిన ఎన్.శ్యామ్, సిద్ధార్థలు ఎంపికై నట్లు కోచ్ వెలిశాల కుమారస్వామి, ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యులు ప్రతాప్‌రెడ్డి సోమవారం తెలిపారు. రాష్ట్ర జట్టు నుంచి జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తులు ఎంపికవడం అభినందనీయమని సీనియర్ క్రీడాకారులు చంద్రయ్య, ప్రసాద్‌రెడ్డి, కాశీనాథ్, కమల్ కిషోర్, యాకయ్య, మోహన్‌లు తెలిపారు.
సమస్యల పరిష్కారంలో విఫలం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు
మహబూబాబాద్: సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వి.వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోకి పోయేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానుకోట మండలంలోని వేంనూర్, కేసముద్రం మండలంలోని బేరువాడ, నారాయణపురం రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రధానంగా యూరియా సమస్య ఎక్కువగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్యాంసుందర్ శర్మ, హిందూ భారతి, గడ్డం అశోక్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
వాజేడు: ఆదివారం ఉదయం నుంచి గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో మూడు రోజులుగా వరద నీటిలో మునిగి ఉన్న రహదారులు క్రమంగా బయటపడ్డాయి. దీంతో ఆయా గ్రామాలకు రాక పోకలు కొనసాగుతున్నాయి. మండల పరిధిలోని టేకులగూడెం గ్రామ చివరన మర్రిమాగు వద్ద జాతీయ రహదారి ముంపునకు గురైన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు రాక పోకలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా నీటిలో ఉన్న జాతీయ రహదారి పైనుంచి వరద నీరు తగ్గడంతో రెండు రాష్ట్రాల మధ్యన రాక పోకలు సాగుతున్నాయి.

నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలి