
ఉప్పొంగిన వాగులు
బయ్యారం/గూడూరు/గార్ల/డోర్నకల్: జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బయ్యారంలో పందిపంపులవాగు వరద ప్రవాహం అల్లిగూడెం–భీమ్లాతండా నడుమ రహదారిపైకి చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో భారీ నీటిపారుదల ప్రాజెక్టు బయ్యారం పెద్దచెరువులోకి వరదనీరు భారీగా వస్తుండటంతో నాలుగు అడుగుల మేర అలుగు పోస్తోంది. మండలంలో ప్రవహించే పాకాల, అలిగేరు, వట్టేరు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. అలాగే గూడూరు నుంచి నెక్కొండ, కేసముద్రం మండలాలకు వెళ్లు మార్గంలోని పాకాలవాగు బ్రిడ్జిపై నుంచి పొంగి ప్రవహించడంతో ఆ వైపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో డోర్నకల్ సమీపంలోని మున్నేరువాగుకు వరద భారీగా పెరిగింది. గార్ల సమీపంలోని పాకాల ఏరు చెక్‌డ్యాం పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గార్ల నుంచి రాంపురం, మద్దివంచ పంచాయతీల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు నిత్యావసరాలు తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
పలు గ్రామాలకు
నిలిచిన రాకపోకలు
బయ్యారం పెద్దచెరువుకు భారీ వరద
చెక్‌డ్యాం పైనుంచి పొంగి
ప్రవహిస్తున్న పాకాల ఏరు

ఉప్పొంగిన వాగులు