
సమీక్షకు అసోసియేషన్లను ఎందుకు పిలువలేదు?
హన్మకొండ: సమీక్ష సమావేశానికి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులను ఎందుకు పిలువలేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. సోమవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమీక్ష సమావేశం నిర్వహించింది. దీనికి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకులను పిలువకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కమిషన్ చైర్మన్.. వెంటనే సంఘాల నాయకులను పిలువాలని ఆదేశించారు. దీంతో వెంటనే అసోసియేషన్ నాయకులకు సమాచారం అందించారు. అదే విధంగా జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి వచ్చారా అని ఆరా తీశారు. రాలేదని అధికారులు చెప్పడంతో న్యూస్ ఎవరు చేస్తారు.. వెంటనే పిలిపించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. తనకు వచ్చిన వినతి పత్రాలను పరిశీలించి వాటిని పంపిస్తానని, వాటిని పరిష్కరించి తనకు నెల రోజుల్లో ఆ నివేదికను పంపాలని సూచించారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బక్క దానయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు ఎన్పీడీసీఎల్‌లో పరిష్కారం కావడం లేదన్నారు. ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్పీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి శ్రీరాం నాయక్ మాట్లాడుతూ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఆదేశాలను కంపెనీ పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కుర్సం నీలాదేవి, రాంబాబు నాయక్, జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్, డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, సీఈలు కె.మాధవ రావు, రాజు చౌహాన్, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎన్పీడీసీఎల్ హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ సి.ప్రభాకర్ కంపెనీలో చేపట్టిన నియామకాలు, పదోన్నతుల్లో అమలు చేసిన రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్‌ను సమీక్షలో వివరించారు.
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల
సమస్యలు పరిష్కరించాలి
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. సోమవారం హనుమకొండలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్, బ్యాక్‌లాగ్ వెకెన్సీస్, రోస్టర్ అమలుపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమీక్ష నిర్వహించింది. అధికారులు డీసీసీబీలో చేపట్టిన నియామకాలు, పదోన్నతుల్లో అమలవుతున్న రిజర్వేషన్ రోస్టర్ వివరాలు వివరించగా టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు బ్యాంకు ప్రగతి, ఉద్యోగుల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. హనుమకొండ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జన్ను మహేందర్, డీసీసీబీ జీఎంలు ఉషా శ్రీ, పద్మావతి, డీజీఎం అశోక్, ఏజీఎంలు రాజు, మధు, స్రవంతి, కృష్ణమోహన్, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య