
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
మహబూబాబాద్ రూరల్ : భార్య మందలించిందనే కారణంతో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై వి.దీపిక తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూక్య గణేశ్ (35), జ్యోత్స్న దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. గణేశ్ కొంతకాలం నుంచి మద్యానికి బానిసై పనికి వెళ్లడం లేదు. దీంతో భార్య గత నెల 31వ తేదీన మందలించింది. దీనిపై మనస్తాపం చెందిన గణేశ్ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. గమనించిన కుటుంబీకులు వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై భార్య జ్యోత్స్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై దీపిక తెలిపారు.
ఒంటరి జీవితం గడపలేక గండితండాలో యువకుడు..
గార్ల: భార్య కాపురానికి రావడం లేదనే కారణంతో ఒంటరి జీవితం గడపలేక ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై రియాజ్‌పాషా కథనం ప్రకారం.. గార్ల జీపీ పరిధి గండితండాకు చెందిన బానోత్ సుమన్(32)కు అదే తండాకు ప్రమీళతో పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఈ క్రమంలో సుమన్ మూడేళ్ల నుంచి మద్యానికి బానిసై ఏ పని చేయకుండా తిరుగుతుండడంతో భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. దీంతో ఒంటరి తనం భరించలేక జీవితంపై విరక్తి చెందిన సుమన్ ఆదివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి ద్వాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రియాజ్‌పాషా సోమవారం పేర్కొన్నారు.
ఇంటి పనుల విషయంలో గొడవతో మరో యువకుడు..
సంగెం: ఇంటి పనుల విషయంలో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన ఓ యువకుడు క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన ముడిదేని సతీశ్(31)కు పదేళ్ల క్రితం ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన తిప్పని అనూషతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఇంటి పనుల విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన సతీశ్ క్షణికావేశంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.

భార్య మందలించిందని భర్త ఆత్మహత్య