
ముదిరాజ్‌లను బీసీ ‘ఏ’లోకి మార్చాలి
నెహ్రూసెంటర్: ముదిరాజ్ కులస్తులు ఐకమత్యంతో ఉంటూ రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ముదిరాజ్ మహాసభ మహబూబాబాద్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ 42 శాతం రిజర్వేషన్‌లో ముదిరాజ్ కులస్తులకు జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి బీసీ ‘ఏ’లోకి మార్చాలన్నారు. ముదిరాజ్ కులస్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లుగానే మత్స్యశాఖ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. మత్స్యకారులకు చేప పిల్లలకు బదులు సొసైటీ సభ్యుల ఖాతాలో నగదు జమ చేయాలని కోరారు. జీపీ పరిధిలోని చెరువులను మత్స్యశాఖ పరిధిలోకి తీసుకురావాలని, తెలంగాణ మత్స్యశాఖ ఫెడరేషన్‌కు ఎన్నికలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో పల్లెబోయిన అశోక్, గుర్రాల మల్లేశం, పిట్టల వెంకట్రాంనర్సయ్య, నీలం దుర్గేశ్, కొత్తూరు రమేశ్, చిల్ల సహదేవ్, గుండెల రాజు, ఎడెల్లి యాకయ్య, అల్వాల సోమయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
శాసన మండలి డిప్యూటీ చైర్మన్
బండా ప్రకాశ్