
ఆకేరు వరదతో ఆగం..
● కోలుకోని బాధితులు
డోర్నకల్: ఏడాది క్రితం సెప్టెంబర్ 1వ తేదీన కురిసిన భారీ వర్షంతో డోర్నకల్ సమీపంలోని మున్నేరువాగుతో పాటు ముల్కలపల్లి సమీపంలోని ఆకేరువాగుకు భారీ వరద పోటెత్తి తీవ్ర నష్టం వాటిల్లింది. సెప్టెంబర్ 1న తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురువడంతో ఆకేరువాగుకు వరద పోటెత్తింది. దీంతో దుబ్బగడ్డతండాలో 45, మోదుగ్గడ్డతండాలో 40, ముల్కలపల్లిలో సుమారు 120 ఇళ్లు ముంపునకు గురయ్యాయి. ఆకేరు పరీవాహక ప్రాంతంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వాగు పక్కన నర్సరీలోని 50 లక్షల మిరప మొక్కలు, మెకానిక్ షెడ్డులోని జేసీబీలు, ట్రాక్టర్లు వరదకు కొట్టుకుపోయాయి. డోర్నకల్ సమీపంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్లన్నీ డోర్నకల్‌లో రోజంతా నిలిచాయి. మున్నేరువాగు ఉప్పొంగడంతో డోర్నకల్, అమ్మపాలెం, గొల్లచర్ల, వెన్నారం గ్రామాల పరిధిలోని పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నాటి వరదను గుర్తు తెచ్చుకుంటున్న స్థానికులు భయంతో వణికిపోతున్నారు.