
త్వరలోనే ‘పంచాయతీ’!
సాక్షిప్రతినిధి, వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైనట్లేనా? లోకల్ బాడీస్ ఎన్నికల విషయంలో ప్రభుత్వం స్టాండ్ మారిందా? మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలకున్నా.. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల వైపు మొగ్గు చూపుతుందా? ఈ దిశగానే ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తుందా? అంటే.. నిజమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు కూడా ఇవే సంకేతాలిస్తున్నాయి. రాష్ట్ర కేబినెట్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్‌లో నిర్వహించాలని నిర్ణయించి ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయాలని నిర్ణయించారు. దీంతోపాటు ఎన్నికల్లో రిజర్వేషన్ పరిమితి ఎత్తివేస్తూ 42శాతం రిజర్వేషన్ కోసం ప్రత్యేక జీఓ తేవాలని తీర్మానించింది. దీంతోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ జారీ చేసిన నేపథ్యంలో.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొదలైంది. గ్రామ పంచాయతీల వారీగా గురువారం ఓటరు జాబితాను అంటించారు. శుక్రవారం కలెక్టర్, ఉన్నతాధికారులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జిల్లా స్థాయి నాయకులతో ఆయా జిల్లాల కలెక్టరేట్లలో సమావేశమయ్యారు.
ఆరు రోజుల్లోనే అన్నీ..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో వేగం పుంజుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఓటరు జాబితాపై ఎస్‌ఈసీ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈమేరకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) రాణి కుముదిణి నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఉమ్మడి వరంగల్‌లోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫొటో ఎలక్ట్రోరల్ రోల్స్‌ను తయారుచేసి సెప్టెంబర్ 2న తుది జాబితా ప్రచురించాలని సూచించారు. ఈమేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28న పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను ప్రదర్శించి.. 28న జిల్లాస్థాయి, 29న మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. 28 నుంచి 30 వరకు అభ్యంతరాలు స్వీకరించి, 31న డీపీఓలు ఓటర్ల సవరణ జాబితాపై కీలక సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్లకు నివేదించనున్నారు. ఆతర్వాత, సెప్టెంబర్ 2న తుది జాబితా ప్రకటించాల్సి ఉండగా.. ఆరు రోజుల్లోనే అన్ని జరిగేలా అధికార యంత్రాంగం పనిచేస్తోంది.
ఉమ్మడి వరంగల్‌లో గ్రామ పంచాయతీలు,
వార్డుల వివరాలు
జిల్లా గ్రామ వార్డులు పోలింగ్ పంచాయతీలు కేంద్రాలు
హనుమకొండ 210 1,986 1986
వరంగల్ 317 2,754 2,754
భూపాలపల్లి 248 2,102 2,102
మహబూబాబాద్ 482 4,110 4,110
ములుగు 171 1,520 1,535
జనగామ 280 2,534 2,534
సెప్టెంబర్ 2న జీపీల్లో ఫైనల్ ఓటర్ల జాబితా
మరో మూడు రోజుల్లోనే అన్నీ..
చురుగ్గా ఓటర్ల సవరణ ప్రక్రియ
సీఈసీ ఆదేశాల మేరకు యాక్షన్‌ప్లాన్ అమలు
రాజకీయ పార్టీల నేతలతో ముగిసిన సమావేశం
31న డీపీఓల కీలక సమావేశం..
ఆ తర్వాత ఓటర్ల జాబితా ప్రకటన
ఉమ్మడి జిల్లాలో 30,43,540 ఓటర్లు..
అత్యధికంగా మహిళలు 15,51,289
ఓటర్ల సవరణ షెడ్యూల్‌తో పల్లెల్లో వేడెక్కిన రాజకీయం