
సీపీఎం నాయకుడిపై డాక్టర్ దాడి
జనగామ: తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ మహిళను శనివారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా..ఓపీ పేరు నమోదు సమయంలో పేషెంట్ తరఫున వచ్చిన సీపీఎం నాయకుడిపై డాక్టర్ దాడికి పాల్పడ్డాడు. సీపీఎం నాయకుడు బొట్ల శేఖర్, బాధితుడి బంధువుల కథనం ప్రకారం.. లింగాలఘణపురం మండలం సిరిపురం గ్రామానికి చెందిన దుర్గి పూలమ్మ వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైంది. అదే మండల సీపీఎం కార్యదర్శి బొడ్డు కరుణాకర్ సదరు మహిళను వెంటనే జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. పూలమ్మ పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే పేరు నమోదు చేసుకుని అడ్మిట్ చేసుకోవాలని డాక్టర్ స్నేహిత్‌ను కోరారు. ఓపిక లేదా.. ఆగలేరా.. అంటూ డాక్టర్ దురుసుగా ప్రవర్తిస్తూ పైకి రావడంతో రోగి బంధువులతో పాటు కరుణాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు డాక్టర్ సహనం కోల్పోయి తన చేతిలో ఉన్న ఓ పాయిజన్ డబ్బాను విసరడంతో కరుణాకర్ చాతీ, కడుపులో బలంగా తాకగా అస్వస్థతకు గురయ్యాడు. డాక్టర్ ప్రవర్తనను నిరసిస్తూ సీపీఎం నాయకులు బొట్ల శేఖర్, జోగు ప్రకాశ్‌తో పాటు బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్సై రాజేశ్, చెన్నకేశవులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. అనంతరం వైద్యుడు స్నేహిత్‌పై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజలింగం మాట్లాడుతూ.. ఘటనపై ఆర్‌ఎంఓ మధుకర్, మరో డాక్టర్‌తో కలిసి విచారణ కమిటీ నియమించామన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని చెప్పారు.
30జెజిఎన్064: వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు
ఆందోళనకు దిగిన బంధువులు,
నాయకులు
జనగామ జిల్లా ఆస్పత్రిలో ఉద్రిక్తత..
రంగంలోకి పోలీసులు