
సమాచారం ఇవ్వడంలో జాప్యమెందుకు?
సాక్షి, మహబూబాబాద్ : దాపరికం లేని పాలన, సంక్షేమ పథకాల్లో పారదర్శకత పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం ప్రకారం పౌరులు అడిగిన సమాచారం ఇవ్వడంలో జాప్యం ఎందుకు చేయాలి? దాపరికం ఎందుకని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాస్, మోహ్సినా పర్వీన్, దేశాల భూపాల్ అన్నారు. శనివారం మహబూబాబాద్ కలెక్టరేట్‌లో కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌తో కలిసి జిల్లాలోని పీఐఓఎస్, ఏపీఐఓఎస్ అన్ని విభాగాల అధికారులతో సమీక్షించారు. అనంతరం జిల్లాలోని పెండింగ్ ఫిర్యాదులపై అర్జీదారులు, అధికారులతో చర్చించారు. 12 శాఖలకు సంబంధించి 115 అప్పీళ్లను నలుగురు కమిషనర్లు పరిష్కరించారు. అనంతరం వారు విలేకరులతో సమావేశంలో మాట్లాడారు. రెండున్నర సంవత్సరాలుగా కమిషన్ లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 18వేల అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటికి పరిష్కార మార్గం చూపుతూ.. ప్రజలు, అధికారుల్లో మరింత అవగాహన పెంచేందుకు కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు 10 జిల్లాల్లో పర్యటించి 4వేలకు పైగా ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. పెండింగ్ దరఖాస్తుల్లో అత్యధికంగా రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ శాఖలవే ఉన్నాయని చెప్పారు. ఇందులో మహబూబాబాద్ జిల్లాలో 160 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. చట్టానికి లోబడి ఉన్న ఫిర్యాదులకు సమాచారం ఇవ్వాలని, సాకుతో కాలయాపన చేయడం సరికాదన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తే సెకండ్ అప్పీల్‌కు వెళ్లొచ్చని సూచించారు. చట్టం ప్రకారం సమాచారం ఇవ్వకపోతే సెక్షన్ 20 అనుసరించి సదరు అధికారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా సమాచారం అడిగే వారు కూడా అనవసర విషయాల జోలికి వెళ్లొద్దని సూచించారు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాన్ని సద్వినియోగం చేసుకుంటే సుపరిపాలన అందించొచ్చని చెప్పారు.
సమాచారం పొందడం పౌరుల హక్కు
సద్వినియోగం చేసుకుంటే సుపరిపాలన
చట్టాన్ని దుర్వినియోగం చేయడం నేరం
రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లు