
ఒడిశా టు గోదావరిఖని..
వాజేడు: ఒడిశా నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా ఐదుగురు పరారయ్యారు. వారి వద్ద నుంచి రూ.15 లక్షల విలువైన 30 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ వివరాలు వెల్లడించారు. గోదావరి ఖనిలోని 8ఇంక్లైన్ కాలనీకి చెందిన తొగరి విష్ణువర్ధన్, జెంజర్ల రేవంత్, మేకల మహేందర్, అజయ్, జెంజర్ల రోహిత్, జెజర్ల బాలాజీ, రుత్విక్ స్నేహితులు. వీరు గంజాయి సేవించడంతో పాటు గోదావరిఖని చుట్టు పక్కల గ్రామాల్లో ఎక్కువ డబ్బులకు అమ్ముతూ జల్సాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 18న ఒడిశాకు వెళ్లి అక్కడ ఓ వ్యక్తి వద్ద రూ. 15 లక్షల విలువైన 30 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. సరుకును బ్యాగుల్లో సర్దుకుని నాలుగు బైక్‌లపై శనివారం వెంకటాపురం(కె) వైపు నుంచి ఏటూరునాగారం వైపునకు వస్తున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు హైవేపై వాజేడు ఎస్సై సతీశ్ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో నాలుగు బైక్‌లు అక్కడికి రావడంతో పోలీసులకు అనుమానం వచ్చి మొదటి బైక్‌ఫై ఉన్న ఇద్దరిని పట్టుకున్నారు. దీనిని వెనుక మూడు బైక్‌లపై ఉన్న వారు గమనించి తమ వద్ద ఉన్న బ్యాగులను పడేసి పరారయ్యారు. ఆ బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి లభించింది. దీంతో తొగరి విష్ణువర్ధన్, జెంజర్ల రేవంత్‌ను అరెస్ట్ చేయగా మేకల మహేందర్, కొల్లి అజయ్, జెంజర్ల బాలాజీ, రుత్విక్ , జెంజర్ల రోహిత్ పరారైనట్లు ఏఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో వెంకటాపురం (కె) సీఐ ముత్యం రమేశ్, వాజేడు ఎస్సై జక్కుల సతీశ్ ఉన్నారు.
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్, ఐదుగురు పరార్
రూ. 15 లక్షల విలువైన సరుకు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ