
ఉగ్ర గోదావరి..
కాళేశ్వరం: ఎగువన కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం బ్యారేజీకి 8.55 లక్షల క్యూసెక్కుల నీరు తరలి వస్తోంది. దీంతో బ్యారేజీలో మొత్తం 66గేట్లు ఎత్తి నీటిని దిగువకు అదేస్థాయిలో కాళేశ్వరం వైపునకు తరలిస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద మహారాష్ట్ర నుంచి తరలొస్తున్న ప్రాణహిత నదితో కలిసి గోదావరి వరద ప్రవాహం పుష్కర ఘాట్లను తాకుతూ 12.550 మీటర్ల ఎత్తులో నీటిమట్టం దిగువకు తరలుతోంది. శుక్రవారం ఉదయం నుంచి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కొనసాగుతోంది. ఇప్పటికే గోదావరి ఒడ్డున పలు దుకాణాలు, హోటళ్ల వద్దకు నీరు చేరింది. దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 10.25లక్షల క్యూసెక్కులు తరలి రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం సమీపంలోని చండ్రుపల్లి వాగు గోదావరి కమ్మేయడంతో రాకపోకలు నిలిచాయి. అన్నారం, కాళేశ్వరం, మహదేవపూర్ వరకు వందల ఎకరాల్లో పత్తి పంట నీటమునిగింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
● కాళేశ్వరం వద్ద కొనసాగుతున్న మొదటిప్రమాద హెచ్చరిక
● పుష్కరఘాట్ వద్ద 12.550 మీటర్ల ఎత్తులో నీటిమట్టం
● అన్నారం బ్యారేజీకి 8.55 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
● మేడిగడ్డ బ్యారేజీకి 10.25 లక్షల క్యూసెక్కులు..
● నీట మునిగిన పంటలు

ఉగ్ర గోదావరి..