
వేయిస్తంభాల గుడిలో డుండి గణపతిగా అలంకరణ
హన్మకొండ కల్చరల్: హనుమకొండ నగరంలోని వేయిస్తంభాల దేవాలయంలో నిర్వహిస్తున్న గణపతినవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం దేవాలయంలోని ఉత్తిష్ట మహాగణపతిని చందన రంగులతో డుండిగణపతిగా అలంకరించి దూర్వాపత్రాలతో ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామివారికి రుద్రాభిషేకం, పూజలు నిర్వహించారు. ఉత్తిష్టగణపతికి ప్రాచీన కోనేరునీటితో జలాభిషేకం నిర్వహించి డుండి గణపతిగా అలంకరించారు. ఉత్సవ గణపతి విగ్రహానికి షోడశోపచారపూజలు జరిగాయి. ఉత్సవమూర్తికి నందివాహనసేవ నిర్వహించారు. యాగశాలలో గణపతినవగ్రహ పాశుపత హోమం, లక్ష్మీగణపతి మూలమంత్రహోమం, సహస్త్రమోదక హోమం నిర్వహించారు. వందలాది మంది భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. పూజాకార్యక్రమాల్లో దాత వేముల ఉమాదేవి, సేవాసమితి సభ్యులు గండ్రాతి రాజు, పులి రజనీకాంత్, చొల్లేటి కృష్ణమాచారి, గరిగె అశోక్ పాల్గొన్నారు. సాయంత్రం ప్రదోషకాల పూజలు జరిగాయి. బోడిగె లక్ష్మీనారాయణ భాగవతార్‌తో హరికథాపారాయణం నిర్వహించారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.