మహబూబాబాద్ రూరల్: ఖైదీలు ఉచిత న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలని మహబూబాబాద్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శాలిని అన్నారు. జిల్లా కేంద్రంలోని సబ్ జైలును శనివారం సందర్శించారు. ఖైదీలను ఉద్దేశించి జడ్జి శాలిని మాట్లాడుతూ.. ఖైదీలు ఉచిత న్యాయ సహాయాన్ని ఉపయోగించుకుని జైలు నుంచి బయటపడాలన్నారు. అదేవిధంగా ఖైదీల ప్రవర్తనలో మార్పురావాలని, తిరిగి మళ్లీ జైలు వైపు చూడకుండా ఉండాలని ఆశిస్తున్నామని తెలిపారు. ఎవరైనా ఖైదీలు తప్పులు ఒప్పుకున్నట్లయితే వారికి శిక్ష నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని సూచించారు. ఖైదీలకు అందుతున్న సదుపాయాలు, సౌకర్యాలు, ఖైదీల గదుల్లో శుభ్రత, ఆరోగ్యం గురించి సీనియర్ సివిల్ జడ్జి ఆరాతీశారు. ఈ సదస్సులో సబ్ జైలు సూపరింటెండెంట్ మల్లెల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
పిల్లలకు ఆధార్‌కార్డులు తప్పనిసరి
మహబూబాబాద్: బాలల సంరక్షణ కేంద్రాల్లోని పిల్లలకు ఆధార్ కార్డులు తప్పనిసరిగా ఇప్పించాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ శాలిని సిబ్బందిని ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలుర, బాలికల సంరక్షణ కేంద్రాలను సందర్శించారు. కేంద్రాల్లోని సౌకర్యాలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.