
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
మహబూబాబాద్ రూరల్ : రైతులకు సరిపడా యూరియా అందించాలంటూ జిల్లా కేంద్రంలోని తొర్రూర్ ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో రైతులు బైఠాయించి శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే యూరియా కోసం పలుదఫాలుగా ఆందోళనలు, రాస్తారోకోలు జరుగగా బీఆర్‌ఎస్, సీపీఐ, ఎల్‌హెచ్‌పీఎస్, ఇతర సంఘాలు మద్దతు తెలుపగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద రాస్తారోకో సందర్భంగా మాత్రం రాజకీయ పార్టీలకు సంబంధంలేకుండా రైతులే స్వచ్ఛందంగా రోడ్డెక్కి తమ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటలకుపైగా రాస్తారోకో చేపట్టగా టౌన్, రూరల్ సీఐలు మహేందర్ రెడ్డి, సర్వయ్య, ఏఓ తిరుపతిరెడ్డి రైతులతో మాట్లాడారు. అయినా వినకుండా ఎమ్మెల్యే మురళీనాయక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి దూసుకువెళ్లారు. పోలీసులు వారిని బలవంతంగా బయటకు పంపించారు. ఈ క్రమంలో రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రైతుల ఆందోళనతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించలేకపోతుందని విమర్శించారు. యూరియా కొరతకు ఎమ్మెల్యే బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సొసైటీ సిబ్బందితో రైతుల వాగ్వాదం
శుక్రవారం తెల్లవారుజామునే రైతులు యూరియా కోసం మహబూబాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో సొసైటీ అధికారులు, సిబ్బంది యూరియా స్టాక్ లేదని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సొసైటీ ప్రధాన గేటు నెట్టుకుని లోపలికి వెళ్లారు. సొసైటీ సీఈఓ ప్రమోద్ కుమార్‌తో వాగ్వాదం చేశారు. టౌన్ ఎస్సైలు ప్రశాంత్ బాబు, శివ, సూరయ్య అక్కడకు చేరుకుని రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఊరుకోలేదు. దీంతో చేసేదేమీలేక సొసైటీ అధికారులు, సిబ్బంది కార్యాలయానికి తాళాలు వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మానుకోట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి
పీఏసీఎస్‌లోకి దూసుకెళ్లిన రైతులు