నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు | - | Sakshi
Sakshi News home page

నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు

Aug 30 2025 7:54 AM | Updated on Aug 30 2025 7:54 AM

నకిలీ

నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు

కురవి : నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు తయారు చేసి వాటి ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. 11మంది రైతులకు వివిధ బ్యాంకుల నుంచి రూ.16.90లక్షల లోన్లు మంజూరు చేయించి బ్యాంకులను బురిడీ కొట్టించిన ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు మహబూబాబాద్‌ డీఎస్పీ తిరుపతిరావు వెల్లడించారు. మహబూబాబాద్‌ జిల్లా కురవి పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం.. కురవి మండలం నేరడ శివారు ఎల్కచెట్టు తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మంచ్యా తండాకు చెందిన మూడు బాలాజీ, మహబూబాబాద్‌ మండలం ఆమన్‌గల్‌ గ్రామ శివారు కస్నా తండాకు చెందిన బానోత్‌ హరికిషన్‌, జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం ఒగ్లాపురం గ్రామానికి చెందిన బానోత్‌ వర్జన్‌ ముఠాగా ఏర్పడ్డారు. మూడు బాలాజీ వివిధ ప్రాంతాల్లోని రైతులనుంచి పాస్‌ పుస్తకాలను సేకరించి, అవి ఎక్కడో పోయినట్లుగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయించాడు. రైతుల ఫిర్యాదు మేరకు అధికారులు కొత్తగా డూప్లికేట్‌ పాస్‌పుస్తకాలు ఇచ్చారు. బాలాజీ ఆయా పాస్‌ పుస్తకాల్లోని పేజీలను తొలగించి బానోత్‌ హరికిషన్‌కు ఇస్తే అతను బానోత్‌ వర్జన్‌కు అందజేశాడు. బానోత్‌ వర్జన్‌ వాటిని కంప్యూటర్‌లో స్కాన్‌ చేసి కలర్‌ జిరాక్స్‌ తీసి పుస్తకాల్లోని మధ్యలోని ఎకరాల విస్తీర్ణాన్ని పెంచి అతికించాడు. ఇలా ఒక్కో పాస్‌ పుస్తకానికి రూ.10వేలు తీసుకుని వారు తయారు చేసిన నకిలీ పాస్‌బుక్‌లను ఆయా రైతులకు అందజేశారు. వాటితో కురవి యూనియన్‌ బ్యాంకునుంచి ఒకరు, డోర్నకల్‌ బ్రాంచ్‌లో ఆరుగురు, మహబూబాబాద్‌ బ్రాంచ్‌లో ఒకరు, మహబూబాబాద్‌ కెనరా బ్యాంకులో ముగ్గురు చొప్పున రూ.16.90లక్షల రుణాలు పొందారు. కాగా వీరు పట్టుబడకపోతే సుమారు రూ.కోటి వరకు రుణాలు పొందేవారని డీఎస్పీ తిరుపతిరావు పేర్కొన్నారు. బ్యాంకుల్లోని ఫీల్డ్‌ అధికారులు సరిగ్గా పరిశీలన చేయకపోవడంతోనే రుణాలు పొందినట్లు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసుపై బ్యాంకు అధికారులు, ఇతరులను మరింత విచారిస్తామని తెలిపారు. అరెస్టు చేసి ముగ్గురి వద్ద నుంచి 23 పాసు పుస్తకాలకుగాను 11 పుస్తకాలను, మూడు సెల్‌ఫోన్లను, కంప్యూటర్‌ మానిటర్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఈ కేసులో సీసీఎస్‌ సీఐ హథీరాం, ఎస్సై ఉషాకుమార్‌, మహబూబాబాద్‌ రూరల్‌ సీఐ సర్వయ్య, కురవి ఎస్సై గండ్రాతి సతీష్‌ విచారణ చేసినట్లు, వీరిని ఎస్పీ అభినందించినట్లు వివరించారు.

రూ.16.90లక్షల క్రాప్‌లోన్లు

పొందిన రైతులు

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు1
1/1

నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement