
సమాచార హక్కు చట్టంతో పారదర్శక పాలన
● కమిషనర్లు అయోధ్యరెడ్డి, శ్రీనివాస్‌రావు
న్యూశాయంపేట : ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్ కలెక్టరేట్‌లో సమాచార హక్కు చట్టం–2005 పై రాష్ట్ర సమాచార కమిషన్ ఆధ్వర్యంలో పీఐఓలు, అప్పిలేట్ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించగా వారు పాల్గొని మాట్లాడారు. సమాచార హక్కు చట్టం పౌరులకు పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన అందించడంలో కీలక సాధనమని తెలిపారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా చట్టం అమల్లోకి వచ్చిందని, ఇందులోని అంశాలపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆర్టీఐ ఫిర్యాదులు తక్కువ అందిన జిల్లాలో వరంగల్ ఒకటి అని చెప్పారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు సకాలంలో పూర్తి సమాచారాన్ని అందించాలని సూచించారు. మూడేళ్ల నుంచి 17వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, జిల్లాల పర్యటనలతో వీటిని అక్కడికక్కడే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి అధికారులకు చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలయ్యేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆర్టీఐ చట్టంలో 31 సెక్షన్లు, ఆరు చాప్టర్లు ఉన్నాయని ఈ చట్టంపై ప్రతి అధికారి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నిబంధనలకు లోబడి సమాచారం అందించాలని తెలిపారు. సమావేశం తర్వాత పెండింగ్‌లో ఉన్న ఆర్టీఐ దరఖాస్తులపై కమిషనర్లు విచారణ చేపట్టారు. సంబంధిత పీఐఓలు దరఖాస్తుదారుల నుంచి వివరాలు స్వీకరించి తగిన ఆదేశాలు జారీ చేశారు. సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన కమిషనర్లకు కలెక్టర్ సత్య శారద, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, డీ సీపీలు షేక్ సలీమా, అంకిత్‌కుమార్ పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీ స్ గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో కమిషనర్లు మొక్కలు నాటారు. సదస్సులో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఏసీపీ శుభం ప్రకాశ్, డీఆర్‌డీఓ విజయలక్ష్మి, ఆర్‌డీఓలు, వివిధ శాఖల పీఐఓలు, అప్పిలేట్ అధికారులు పాల్గొన్నారు.