
గోదావరి పరవళ్లు
కాళేశ్వరం : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శుక్రవారం పుష్కర ఘాట్‌ను తాకుతూ కాళేశ్వరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ వద్ద 8.51 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో తరలి వస్తోంది. దీంతో బ్యారేజీలో మొత్తం 66 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద మహారాష్ట్ర నుంచి వస్తున్న ప్రాణహిత నదితో కలిసి గోదావరి వరద ప్రవాహం పుష్కర ఘాట్లను తాకుతూ 12.330 మీటర్ల ఎత్తులో నీటిమట్టం దిగువకు తరలి పోతుంది. దీంతో ఉదయం సీడబ్ల్యూసీ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే దిగువన మేడిగడ్డ బ్యారేజీలో 9.71లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో మొత్తం 85 గేట్లు ఎత్తి అదేస్థాయిలో ఔట్‌ఫ్లో నీటిని దిగువకు తరలిస్తున్నారు. అన్నారం సమీపంలోని చండ్రుపల్లి వాగును గోదావరి కమ్మేయడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అన్నారం నుంచి మద్దుపల్లి, కాళేశ్వరం వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయింది.
నీటమునిగిన పత్తి పంట..
అన్నారం, మద్దులపల్లి, పలుగుల, బలిజాపూర్, పూస్కపల్లి, కాళేశ్వరం వరకు వందల ఎకరాల్లో పత్తి పంట నీటమునిగింది. అధికారులు సర్వే చేసి పరిహారం చెల్లించాలని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
అన్నారం బ్యారేజీలో 8.51లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
మేడిగడ్డ బ్యారేజీలో 9.71లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
వందల ఎకరాల్లో నీటమునిగిన పత్తిపంట