
ఉపద్రవాన్ని మరువని మోరంచపల్లి..
భూపాలపల్లి: ఎగువన భారీ వర్షాలు కురువడం, చెరువుల కట్టలు తెగిపోవడంతో 2023 జూలై 27వ తేదీన తెల్లవారుజామున 4 గంటలకు భూపాలపల్లి మండలం మోరంచవాగు ఉప్పొంగి మోరంచపల్లి గ్రామం మొత్తం వరదనీటిలో మునిగింది. ఊరంతా జలమయం కావడంతో 280 ఇళ్లలోని సుమారు వెయ్యి మంది బిల్డింగ్‌ల పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ, గంగిడి సరోజన, గడ్డం మహాలక్ష్మి వాగు వరదలో కొట్టుకుపోయారు. రెండు, మూడు రోజులకు ఓదిరెడ్డి, వజ్రమ్మ, సరోజన మృతదేహాలు లభించగా మహాలక్ష్మి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. గ్రామం జలమయం కావడంతో 126 గేదెలు, 3 దుక్కిటెద్దులు మృత్యువాత పడ్డాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. కాగా అప్పటి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించింది. మహాలక్ష్మి ఆచూకీ లభించకపోవడంతో ఆర్థిక సాయం అందించలేదు. ఇటీవల ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆ కుటుంబానికి కూడా రూ. 5 లక్షల సాయం అందజేశారు.
చేపట్టని శాశ్వత పనులు..
ఈ రెండేళ్లలో మరోమారు ఇలాంటి ఘటన చోటుచేసుకున్నా గ్రామానికి ముప్పు వాటిళ్లకుండా ఉండేందుకు ఎలాంటి శాశ్వత పనులు చేపట్టలేదు. భారీ వర్షాలు కురిస్తే వాగు ఒడ్డు ఇళ్లకు ప్రమాదం వాటిళ్లే అవకాశం ఉంది. వాగుపై నిర్మించిన, పక్కనే ఉన్న మరో బ్రిడ్జిని పూర్తిగా తొలగించి సుమారు 500 మీటర్ల దూరం హైలెవల్ బ్రిడ్జిని నిర్మిస్తే ఎంతటి వరదలొచ్చినా గ్రామానికి ముప్పు వాటిళ్లదు. ఈ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఉపద్రవాన్ని మరువని మోరంచపల్లి..