
డిప్యూటీ రిజిస్ట్రార్లుగా పదోన్నతులు
ఎట్టకేలకు ఏఆర్‌లకు
● కేయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారిలో నలుగురికి ఎట్టకేలకు డిప్యూటీ రిజిస్ట్రార్లుగా పదోన్నతులు లభించాయి. వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అప్రూవల్ మేరకు శనివారం రిజిస్ట్రార్ వి. రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఆరేళ్లుగా ఏఆర్‌లకు డిప్యూటీ రిజిస్ట్రార్లుగా పదోన్నతుల కల్పన జరగలేదు. సీనియారిటీ వివాదం నేపథ్యంలో జాప్యం జరుగుతూ వచ్చింది. దీనిపై గతంలోనే కేయూలో కీలక పోస్టులు ఖాళీ అని, ఏఆర్‌లకు డిప్యూటీ రిజిస్ట్రార్లుగా పదోన్నతులు కల్పించడం లేదని, యూనివర్సిటీలో నాలుగు డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు వెకెన్సీలుగా ఉన్నాయని, పదోన్నతుల కల్పించాలని ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విధితమే. దీంతో వీసీ ప్రతాప్‌రెడ్డి.. ఏఆర్‌లకు డిప్యూటీ రిజిస్ట్రార్లుగా పదోన్నతి కల్పనపై అందుకు ఉన్న అవరోధాలను అధిగమించేందుకు దృష్టి సారించారు. చివరకు సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించారు. పదోన్నతి పొందిన వారిలో యూనివర్సిటీలో యూజీసీ యూనిట్‌లో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తున్న హబీబుద్దీన్, పరిపాలన భవనంలో టీచింగ్‌అండ్‌గెజిటెడ్ విభాగం అసిస్టెంట్ రిజిస్ట్రార్ పంజాల శ్రీధర్, ఆడిట్ విభాగం అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎల్. రాము, పరీక్షల విభాగం అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎం నర్సింహారావు ఉన్నారు. కాగా, ప్రస్తుతం పనిచేస్తున్న విభాగాల్లోనే వీరు డిప్యూటీ రిజిస్ట్రార్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వీరిని బోధన, బోధనేతర ఉద్యోగులు అభినందించారు.