
ఆర్టీసీ బస్సు, కారు ఢీ..
చిట్యాల: ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన శని వారం మండలంలోని కొత్తపేట శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జమ్మికుంట నుంచి జయశంకర్ భూపాలపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు కొత్తపేట బస్టాండ్ వద్ద ఆగి ప్రయాణికులను ఎక్కించుకుని కదులుతోంది. ఈ క్రమంలో ఎదురుగా కారు అతివేగంగా వచ్చి బస్సును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు టీచర్లు, ఆర్టీసీ బస్సులో ఉన్న మరో ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరు టీచర్లను 108లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై శ్రావన్‌కుమార్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని ఆర్టీసీ బస్సులో ప్రయాణించి గాయపడిన కొత్తపేటకు చెందిన చంద్రయ్యను తన వాహనంలో చిట్యాల సివిల్ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందించారు. ఈ ఘటనపై బస్సు డ్రైవర్ గోలి జనార్ధన్ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్(ప్రభుత్వ ఉపాధ్యాయుడు) పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావన్‌కుమార్ తెలిపారు.
ముగ్గురికి స్వల్ప గాయాలు